HomeతెలంగాణMahipal Reddy: పటాన్ చెరు కాంగ్రెస్ లో చిచ్చు.. గులాబీ పార్టీ వైపు ఎమ్మెల్యే మహిపాల్...

Mahipal Reddy: పటాన్ చెరు కాంగ్రెస్ లో చిచ్చు.. గులాబీ పార్టీ వైపు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి చూపు!

* కాంగ్రెస్ వైపు వచ్చినట్టే వచ్చి తిరిగి మాతృ పార్టీ వైపు

* వచ్చే ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థి అంటూ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రకటన

* తీవ్ర ఆవేదనలో నీలం మధు వర్గం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి ప్రారంభం అయింది. పటాన్ చెరు నియోజకవర్గం విషయంలో సరికొత్త లొల్లి ప్రారంభం అయింది. దీనికి ఆద్యం పోశారు మంత్రి దామోదర  రాజనర్సింహ. ఏకపక్షంగా నియోజకవర్గ అభ్యర్థిని ప్రకటించడం సరికొత్త వివాదానికి దారి తీసింది.  ఈరోజు మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రమాణ స్వీకారం సందర్భంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ అని ప్రకటించడం ప్రకంపనలు రేపుతోంది. అసలే అగ్గి మీద గుగ్గిలం గా ఉన్న మహిపాల్ రెడ్డి కి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్లు అయింది. ఎందుకంటే ఆయన తిరిగి గులాబీ పార్టీలో చేరిపోతారు అన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో ఉంది. సరిగ్గా ఇదే సమయంలో మహిపాల్ రెడ్డి ని వదులుకుంటున్నట్లు ఏకంగా మంత్రి దామోదర్ రాజనర్సింహ సంకేతాలు పంపారు.

కాంగ్రెస్ లో ఫిరాయించిన ఎమ్మెల్యే

మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పటాన్ చెరు నియోజకవర్గం నుంచి గులాబీ పార్టీ తరఫున మహిపాల్ రెడ్డి గెలిచారు. కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే గత పదిహేళ్లుగా బి ఆర్ఎస్ హయాంలో  కాటా శ్రీనివాస్ గౌడ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకున్నారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీంతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే కారు పార్టీ నుంచి గెలిచిన మహిపాల్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ గూటికి వచ్చారు. స్థానిక కాంగ్రెస్ నాయకులు మహిపాల్ రెడ్డి చరితను బహిరంగంగానే వ్యతిరేకించారు. తమ మీద కేసులు పెట్టి జైలుకు పంపించిన మహిపాల్ రెడ్డి ని ఎలా పార్టీలో చేర్చుకుంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మహిపాల్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ పార్టీలో మూడు ముక్కలాట ప్రారంభం అయ్యింది. ఎమ్మెల్యే అభ్యర్థిగా కాటా శ్రీనివాస్ గౌడ్ పోటీ చేయగా ఎంపీ అభ్యర్థిగా నీలం మధు పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు మహిపాల్ రెడ్డి చేరికతో అటు శ్రీనివాస్ గౌడ్ తో పాటు నీలం మధు వర్గాలు డీలా పడ్డాయి.

మనసు మార్చుకున్న మహిపాల్ రెడ్డి

అయితే ఇప్పుడు పటాన్ చెరు నియోజకవర్గం విషయంలో రకరకాల చర్చ నడుస్తోంది. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పునరాలోచనలో పడ్డారని.. ఆయన కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు తిరిగి గులాబీ పార్టీలో చేరిపోతారని ప్రచారం నడుస్తోంది. అందుకు తగ్గట్టుగానే మొన్నటి మున్సిపల్ ఎన్నికల్లో మహిపాల్ రెడ్డి తీరు అలానే ఉంది. తన కుటుంబ సభ్యులను గులాబీ పార్టీలో ఉంచి ఆ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ఆయన ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. కచ్చితంగా మహిపాల్ రెడ్డి గులాబీ పార్టీలో చేరిపోతారన్న సమాచారం కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈ తరుణంలో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు వర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిత్వం పై ఆశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్టు పావులు కదిపింది.

తొందరపడ్డ దామోదర్ రాజనర్సింహ

ఇటీవల పటాన్ చేరు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అభీష్టానికి వ్యతిరేకంగా మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ప్రకటించింది ప్రభుత్వం. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి దామోదర రాజనర్సింహ హాజరయ్యారు. కానీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి వర్గీయులు గైర్హాజరయ్యారు. దీంతో ఆయన గులాబీ పార్టీకి దగ్గర అయినట్లు అర్థమవుతుంది. దీంతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి పదవి కోసం ఆశలు పెట్టుకున్నారు రెండు వర్గాలు. ఒకవైపు శ్రీనివాస్ గౌడ్ తో పాటు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నీలం మధు సైతం ఎమ్మెల్యే అభ్యర్థిగా తమను ఎంపిక చేస్తారని ఆశలు పెట్టుకున్నారు. కానీ మంత్రి దామోదర్ రాజనర్సింహ అనూహ్యంగా వచ్చే ఎన్నికల్లో శ్రీనివాస్ గౌడ్ పటాన్ చెరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అదే వేదిక నుంచి ప్రకటించారు. దీంతో ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన నీలం మధు వర్గీయులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. కానీ ఆ ప్రకటన చేసిన దామోదర్ రాజనర్సింహ అక్కడినుంచి వెళ్లిపోయాక మరో మంత్రి గడ్డం వివేక్ ఈ సభకు హాజరయ్యారు. అయితే అప్పటికే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ ఘటనతో అయోమయానికి గురయ్యాయి. ఆ సమావేశం నుంచి నిరాశతో జారుకున్నాయి. మొత్తానికైతే కాంగ్రెస్ నాయకత్వం పటాన్ చెరు నియోజకవర్గం విషయంలో వ్యవహరించిన తీరు మాత్రం ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఒకవైపు ఎమ్మెల్యే గులాబీ పార్టీ నుంచి వచ్చినట్టే వచ్చి జారుకున్నారు. ఇంకో నేత శ్రీనివాస్ గౌడ్ విషయంలో కాంగ్రెస్ ఒక నిర్ణయానికి వచ్చింది. దీనిని నిరసిస్తూ నీలం మధు వర్గం కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర ఆగ్రహంతో ఉంది. ఈ పరిణామాలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందులు తెచ్చి పెట్టేవే.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు