* కాంగ్రెస్ లో ఉన్నప్పుడు వైయస్ ఫ్యామిలీ పై విరుచుకు పడిన వైనం
* దానిని గుర్తు చేసిన మంత్రి అచ్చెన్న
* ఆ భయంతోనే ఏడ్చారు అంటూ విశ్లేషణలు
క్రైమ్ మిర్రర్, పొలిటికల్ డెస్క్: ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ హాట్ టాపిక్. రెండు రోజుల కిందట ఆయన ప్రెస్మీట్లో వైయస్ రాజశేఖర్ రెడ్డిని తలుచుకొని బోరున విలపించారు. కేవలం ఏడ్చేందుకే ఆయన ప్రెస్ మీట్ పెట్టినట్టు కనిపించారు. అయితే ఇప్పుడు బొత్స తీరుపై రకరకాల చర్చ నడుస్తోంది. జగన్మోహన్ రెడ్డి పై కూటమి మంత్రి కింజరాపు అచ్చెనాయుడు విమర్శలు చేసే క్రమంలో బొత్స పేరు తీసుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఎంతవరకైనా తెగిస్తారని ఆరోపించారు. తండ్రి చావు సమయంలో కూడా ఆయన ముఖ్యమంత్రి పదవి కోసం సంతకాలు చేశారని చెప్పుకొచ్చారు. అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న బొత్స సత్యనారాయణ దీనిపై విమర్శలు చేశారని కూడా చెప్పడం దుమారం రేగింది. దానిని పట్టుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు బొత్స. బోరున విలపిస్తూ తనకు ఏ పాపం తెలీదని చెప్పుకొచ్చారు. అయితే ఎంతటి పరిస్థితినైనా ఎదుర్కొనే బొత్స అలా ఏడ్చేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ బొత్స అలా రోదించడం వెనుక అనేక రకాల కారణాలు ఉన్నాయని ఇప్పుడు విశ్లేషణలు మొదలయ్యాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి తనను పక్కన పెడతారన్న ఆందోళనతోనే ఆయన ఈ ఏడుపు డ్రామాలకు తెరతీసారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు..
ఉమ్మడి ఏపీలో పిసిసి అధ్యక్షుడిగా వ్యవహరించారు బొత్స సత్యనారాయణ. అప్పట్లో ఒక్క జగన్మోహన్ రెడ్డి పై మాత్రమే కాదు వైయస్ కుటుంబ సభ్యులపై కూడా ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 2009లో రెండోసారి అధికారంలోకి వచ్చారు రాజశేఖర్ రెడ్డి. కానీ అక్కడకు కొద్ది రోజులకే హెలిక్యాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. అప్పట్లో క్యాబినెట్ సహచరులు అంతా సీనియర్లు. అందులో బొత్స సత్యనారాయణ కూడా ఒకరు. అలా ముఖ్యమంత్రి రేసులో కూడా ఉండేవారు. కానీ హై కమాండ్ ముఖ్యమంత్రి పదవిని కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చి పిసిసి అధ్యక్ష పదవి బొత్స సత్యనారాయణ కు కట్టబెట్టింది. జాతీయస్థాయిలో కూడా కాంగ్రెస్ అధికారంలో ఉండే సమయం అది. ఆపై బలంగా కనిపించిన సమయంలోనే పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు బొత్స. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వెళ్లిపోయారు. ఆయనకు అండదండగా నిలిచేవారు వైయస్ విజయమ్మ,షర్మిల. అప్పట్లో వారు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడంతో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న బొత్స అంతే దూకుడుగా స్పందించేవారు. వారి కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి. ఒకానొక దశలో రాజశేఖర్ రెడ్డికి తాగుడు అలవాటు ఉందని కూడా బయటపెట్టారు ఆయనే. అప్పట్లో బొత్స వ్యాఖ్యలతో విజయమ్మ మనస్థాపానికి కూడా గురయ్యారట.
చాలా ఆలస్యంగా వైసీపీలోకి..
అయితే రాజకీయంగా ఎవరి అవసరం ఎవరికీ వస్తుందో చెప్పలేం. కానీ తన విషయంలో బొత్స సత్యనారాయణ వ్యవహరించిన తీరు జగన్మోహన్ రెడ్డికి తెలుసు. అందుకే 2014 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ సీనియర్లంతా వైసిపి బాట పట్టారు. ఒక్క బొత్స సత్యనారాయణ మాత్రం రాలేకపోయారు. అందుకు కారణం జగన్ తో పాటు వైయస్ ఫ్యామిలీపై బొత్స చేసిన వ్యాఖ్యలే అని తెలుస్తోంది. కానీ 2014లో ఓడిపోయిన తర్వాత విజయనగరం తో పాటు ఉత్తరాంధ్రలో బొత్స అవసరం జగన్మోహన్ రెడ్డికి ఏర్పడింది. బొత్సకు సైతం వేరే ఆప్షన్ లేదు. కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బ తినడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయింది బొత్స ఫ్యామిలీ. జగన్మోహన్ రెడ్డి సైతం పాత పగలు మరిచిపోయి బొత్స ఫ్యామిలీకి ఎనలేని ప్రాధాన్యమిస్తూ వచ్చారు.
ప్రస్తుతం ఎనలేని ప్రాధాన్యం..
అయితే ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్ తర్వాతే ఎవరూ అంటే బొత్స అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే బొత్సను తీసుకొచ్చి విశాఖ ఎమ్మెల్సీ ని చేశారు. ఏకంగా శాసనమండలిలో విపక్ష నాయకుడిగా క్యాబినెట్ హోదా కల్పించారు. ఇటువంటి సమయంలో బొత్స పాత వ్యవహార శైలి గుర్తుకు తెస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ తనను పక్కన పెడతారు అన్న ఆందోళన ఆయనది. అందుకే మీడియా ముందుకు వచ్చి ఏడ్చారని విశ్లేషణలు మొదలయ్యాయి. చివరకు షర్మిల సైతం అప్పటి సంగతులను గుర్తుచేస్తూ బొత్స తీరును తప్పు పట్టారు. ప్రస్తుతం ఇది ఏపీ రాజకీయాల్లో వైరల్ అంశంగా మారిపోయింది.
