-
తెర వెనుక కేవీపీ రామచంద్రరావు
-
ఏపీలో రాజకీయ సంచలనం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: కలిసి ఉంటే కలదు సుఖం.. ఇదేదో సినిమా టైటిల్ కాదు. ఎక్కడ చూసినా.. ఈ రంగంలో నైనా ఈ ఫార్ములా ఇట్టే పని చేస్తుంది. ఎందుకంటే కలిసికట్టు.. ఐక్యత.. సమన్వయం అనేది విజయానికి పెట్టింది పేరు. అయితే బహుశా మనుషుల మనస్తత్వాలు బట్టి ఇది అంతగా కుదిరే పని కాదు. ఇప్పుడు వైయస్సార్ పిల్లల మధ్య ఇదే వైరం కొనసాగుతోంది. జాతి వైరం అన్నట్టు కనిపిస్తోంది. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు.. ఆయన మరణం తరువాత పిల్లలిద్దరూ ఐక్యంగా కనిపించేవారు. తల్లి మాట జవదాటే వారు కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే వారిది వసుదైక కుటుంబం. రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఏకతాటి పైకి నిలిస్తే రెండు కళ్ళు చాలవు కూడా. కానీ రాజశేఖర్ రెడ్డి అకాల మరణం తోనే ఆ కుటుంబం చిన్నభిన్నం అయ్యింది. ఒకరంటే ఒకరు వద్దనుకునే స్థాయికి చేరింది. పిల్లలిద్దరినీ సమన్వయం చేసుకునే క్రమంలో విజయమ్మ పడిన బాధ వర్ణనాతీతం.
-
అదో వసుదైక కుటుంబం
2019 ఎన్నికల వరకు రాజశేఖర్ రెడ్డి కుటుంబం అంటే ఏకతాటిపైగా నిలిచింది. కానీ జగన్మోహన్ రెడ్డి చేతికి అధికారం వచ్చిన తరువాత ఆ కుటుంబం విడిపోయింది. వివేకానంద రెడ్డి హత్య అంశం అనేది ఆ కుటుంబాన్ని అడ్డగోలుగా చీల్చింది. అన్నింటికీ మించి వ్యక్తిగత, కుటుంబ, ఆస్తి వివాదాలు అనేవి ఆ కుటుంబంలో తీవ్ర సంక్షోభాన్ని నింపాయి. రాజశేఖర్ రెడ్డి వారసులిగా, ఐక్యానికి మారు చిహ్నంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి, షర్మిలా రెడ్డిల మధ్య కుటుంబ ఆస్తులు, రాజకీయ వారసత్వం పై కీచులాట ప్రారంభం అయింది. అలా ఆ సంక్షోభం ఆ కుటుంబాన్ని అడ్డగోలుగా చీల్చింది. ఒకరినొకరు బలహీన పరుచుకొని… రాజకీయంగా దెబ్బతీసుకొని ప్రజల్లో పలుచనయ్యారు. వైయస్ కుటుంబ అభిమానులకు తీరని సంక్షోభాన్ని, విషాదాన్ని మిగిల్చారు.
-
పరిస్థితి చేజారుతుండడంతో..
మరోవైపు జగన్మోహన్ రెడ్డిని దారుణంగా, రాజకీయంగా దెబ్బతీస్తున్నారు షర్మిల. రోజురోజుకు వారి మధ్య విభేదాలు పెరుగుతున్నాయి. పచ్చగడ్డి వేస్తేనే భగ్గు మనే పరిస్థితికి చేరుకుంది. ఇది ఎంత మాత్రం రాజశేఖరరెడ్డి అభిమానులకు మింగుడు పడడం లేదు. అందుకే ఇప్పుడు వారిద్దరి మధ్య రాజీ చేసేందుకు కొత్త ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు కెవిపి రామచంద్రరావు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అదే కాంగ్రెస్ పార్టీకి ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్నారు షర్మిల. మరోవైపు మాజీ ముఖ్యమంత్రిగా.. మరోసారి ఏపీకి ముఖ్యమంత్రి కావాలని బలంగా ఆకాంక్షిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే రాజశేఖర్ రెడ్డి కి దగ్గరగా ఉండే కెవిపి రామచంద్రరావు విషయంలో నిర్లక్ష్యంగా ఉండేవారు జగన్మోహన్ రెడ్డి. ఆపై రామచంద్రరావు సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉండేవారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న షర్మిలకు సలహాలు ఇచ్చే పాత్ర కూడా పోషించలేదు. కానీ వైయస్ రాజశేఖర్ రెడ్డి సన్నిహితుల ఒత్తిడి మేరకు పిల్లలిద్దరినీ కలిపేందుకు రామచంద్రరావు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మరి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
