సిద్దిపేట వేదికగా తెలంగాణ రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో భేటీ కావడం రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. సుమారు ఐదు గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశం ముగిసిన అనంతరం జీవన్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై నిప్పులు చెరిగారు. ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం కనుమరుగైందని విమర్శించారు.
కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రంపై పట్టు కోల్పోయిందని జీవన్ రెడ్డి ఆరోపించారు. గతంలో పీసీసీ నిర్ణయాల మేరకు ముఖ్యమంత్రులు నడుచుకునే గొప్ప సంప్రదాయం ఉండేదని గుర్తు చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేవలం సీఎం ఆదేశాలను అమలు చేసే ఒక సాధారణ విభాగంగా పీసీసీ మారిపోయిందని ఎద్దేవా చేశారు. క్షేత్రస్థాయిలో పీసీసీ చేసే తప్పులను ఏఐసీసీ ఖాతాలో వేయడం సరికాదని హితవు పలికారు. రేవంత్ రెడ్డి ఒక ప్రజా సేవకుడిలా కాకుండా నిరంకుశ పాలకుడిలా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
తన సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో 14 సార్లు బీ-ఫామ్ పొందడం తన వ్యక్తిగత సమర్థతకు నిదర్శనమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కంటెంట్ ఉన్న నాయకుడిని కాబట్టే పార్టీ ఇన్నిసార్లు అవకాశం ఇచ్చిందని స్పష్టం చేశారు. అధికార పార్టీని వీడి ప్రతిపక్షంలోకి ఎందుకు వెళ్తున్నానో ప్రజలే అర్థం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన తిరోగమన దిశలో సాగుతోందని విశ్లేషించారు. ప్రజల్లో ఇప్పటికే మార్పు మొదలైందని.. ‘కాంగ్రెస్ పోవాలి.. కేసీఆర్ రావాలి’ అనే చర్చ ఊపందుకుందని తెలిపారు.
త్వరలోనే జగిత్యాల కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహిస్తానని జీవన్ రెడ్డి ప్రకటించారు. ఆ సభలో కేసీఆర్ సమక్షంలో అధికారికంగా బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకుంటానని వెల్లడించారు. మిగిలిన రెండున్నరేళ్ల కాలంలోనైనా ప్రభుత్వం ప్రజల కోసం చిత్తశుద్ధితో పని చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. కేసీఆర్ భేటీ తర్వాత జీవన్ రెడ్డి చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ శ్రేణుల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దశాబ్దాల అనుభవం ఉన్న నాయకుడు ఇలా నేరుగా సీఎంను టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
తెలంగాణ అభివృద్ధి కేవలం కేసీఆర్ నాయకత్వంలోనే సాధ్యమని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని అనూహ్య మార్పులు చోటుచేసుకుంటాయని జీవన్ రెడ్డి జోస్యం చెప్పారు. ఒక సీనియర్ నేత అధికార పక్షాన్ని వీడి ప్రతిపక్ష గొంతుకగా మారడం పట్ల సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ పార్టీ తీరుపై ఆయన విసిరిన విమర్శనాస్త్రాలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ భేటీతో జగిత్యాల రాజకీయాలే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి.
ALSO READ: రాజ్య సభ సభ్యుడిగా నితీష్‌కుమార్ ప్రమాణ స్వీకారం…!
