-
మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఫిర్యాదులు
-
విచారణకు ఆదేశించిన భారత ఎన్నికల సంఘం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: జనసేనకు వివాదాలు వీడటం లేదు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు వివాదాస్పద అంశాల్లో చిక్కుకుంటున్నారు. లైంగిక పరమైన వేధింపులు కూడా వెంటాడాయి. తాజాగా మరో ఎమ్మెల్యే మనీ లాండరింగ్ కేసులో చిక్కుకున్నారు. భారత ఎన్నికల సంఘం సీరియస్ కావడం ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం కళ్యాణి పై భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందింది. 2024 ఎన్నికల్లో ఆమె నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా గెలిచారు. ఎన్నికల్లో గెలుపొందేందుకు ఆమె మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు అన్నది ఇప్పుడు ఆరోపణ. దీనిపైనే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దర్యాప్తు చేయనున్నారు.
విద్యా సంస్థల అధినేత..
ఉత్తరాంధ్రలో మిరాకిల్ విద్యాసంస్థల అధినేతగా ఉన్న లోకం కళ్యాణి జనసేన లో చేరారు. 2019లో ఆమె జనసేన అభ్యర్థిగా నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కేవలం 12 వేల ఓట్లను మాత్రమే సొంతం చేసుకున్నారు. అయితే రాష్ట్రస్థాయి పొత్తులో భాగంగా 2024 ఎన్నికల్లో ఆమె జనసేన అభ్యర్థిగా నెల్లిమర్ల నుంచి రెండోసారి పోటీలో దిగారు. కూటమి అభ్యర్థిగా భారీ విజయం సొంతం చేసుకున్నారు. వైసీపీ అభ్యర్థి బొడ్డు కొండ అప్పలనాయుడు పై 39 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఆ సమయంలో మిరాకిల్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న 300 మంది ఉద్యోగుల ఖాతాల్లో జీతాల కంటే అదనంగా నగదు నిల్వలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. సాధారణంగా లక్ష రూపాయలు జీతం ఉంటే.. ఒక్కొక్కరి ఖాతాలో రెండు లక్షల రూపాయల వరకు జమ చేశారు. అలా మూడు నెలల పాటు జమ చేసినట్లు ఇప్పుడు ఎన్నికల కమిషన్కు పూర్తి ఆధారాలతో ఫిర్యాదు చేశారు మిరాకిల్ మాజీ ఉద్యోగి ఒకరు. దీంతో ఎన్నికల సంఘం సీరియస్ గా తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు దర్యాప్తు చేయాలని ఆదేశించింది. ఒకవేళ మనీ లాండరింగ్ అని తేలితే మాత్రం కఠిన చర్యలు తప్పవు.
కూటమిలో విభేదాలు..
నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవి గెలిచిన నాటి నుంచి అనేక రకాల వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ముఖ్యంగా ఆమె వైఖరి కూటమిలో ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. వాస్తవానికి ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలం ఉంది. 2019 ఎన్నికల వరకు మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి నాయుడు ప్రాతినిధ్యం వహించేవారు. అయితే ఆయన వయోభారంతో బాధపడుతున్నారు. దీంతో కర్రోతు బంగారు రాజుకు టిడిపి బాధ్యతలు కట్టబెట్టారు చంద్రబాబు. రాష్ట్రంలోనే టిడిపి గెలిచే నియోజకవర్గంగా తీర్చిదిద్దారు బంగారు రాజు. లోకేష్ పాదయాత్ర విజయోత్సవ సభను భోగాపురం మండలంలో నిర్వహించడం వెనుక బంగారు రాజు ఉన్నారు. అయితే పొత్తులో భాగంగా ఈ సీటు జనసేనకు కేటాయించడంతో టీడీపీ శ్రేణులు ఆవేదనకు గురయ్యాయి. అయితే చంద్రబాబు సముదాయించడంతో జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన లోకం మాధవి గెలుపు కోసం కృషి చేసింది టిడిపి శ్రేణులు. అయితే కూటమి అధికారంలోకి రావడంతో బంగారు రాజుకు రాష్ట్రస్థాయి నామినేటెడ్ పదవి దక్కింది. అయితే స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న లోకం మాధవి బంగారు రాజు తో పాటు టిడిపి క్యాడర్ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తరచూ వివాదాలు కొనసాగుతున్నాయి. ఎప్పటికప్పుడు హై కమాండ్లు దిద్దుబాటు చర్యలకు దిగుతూ వచ్చాయి. ఇప్పుడు ఏకంగా మనీ ల్యాండరింగ్ కేసు చిక్కుకోవడంతో కూటమికి ఇబ్బందికరంగా మారింది.
