ఒక చిన్న కుటుంబం ప్రశాంతంగా సాగుతున్న జీవితం.. కానీ ఒక్క అనుకోని సమస్యతో పూర్తిగా మారిపోయిన పరిస్థితులు.. ఆ పరిస్థితులను ఎదుర్కొంటూ నిలబడిన ఓ మహిళ కథ ఇప్పుడు ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు గ్రామానికి చెందిన శ్రీలక్ష్మి జీవితం సాధారణ గృహిణిగా ప్రారంభమై, కాలానుగుణంగా పోరాట గాధగా మారింది.
శ్రీలక్ష్మి భర్త గ్యారేజ్‌లో బైక్ రిపేరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. అయితే అనుకోకుండా ఆయనకు వెన్నెముకకు సంబంధించిన తీవ్రమైన సమస్య తలెత్తడంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన పూర్తిగా మంచానికే పరిమితమయ్యారు. దీంతో కుటుంబ బాధ్యతలన్నీ ఒక్కసారిగా శ్రీలక్ష్మి భుజాలపై పడ్డాయి. మొదట రోజువారీ కూలీ పనులు చేస్తూ ఇంటిని నడిపించాలని ప్రయత్నించినా, ఆ ఆదాయం చికిత్స ఖర్చులు, ఇతర అవసరాలకు సరిపోలేదు.
ఈ కష్టసమయంలో శ్రీలక్ష్మి ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకుంది. భర్త చేస్తున్న వృత్తినే తన జీవనాధారంగా మార్చుకోవాలని నిర్ణయించింది. గ్యారేజ్‌లో భర్త పని చేసే విధానాన్ని గమనిస్తూ చిన్నచిన్న పనులతో మొదలుపెట్టింది. మొదట్లో కొంతమంది ఆమెను వ్యంగ్యంగా చూసినా, ఆమె పట్టుదల తగ్గలేదు. క్రమంగా బైక్ రిపేరింగ్‌లో నైపుణ్యం పెంచుకుని, ఇంజిన్ ఆయిల్ మార్చడం నుంచి వివిధ యాంత్రిక సమస్యలను పరిష్కరించే స్థాయికి ఎదిగింది.
భర్త ప్రోత్సాహం, తన కృషి కలిసి ఆమెను ఈ స్థాయికి తీసుకువచ్చాయి. ప్రస్తుతం శ్రీలక్ష్మి గ్యారేజ్‌లో బైక్‌లను రిపేర్ చేస్తూ కుటుంబాన్ని స్థిరంగా నడిపిస్తోంది. తాను మొదట గృహిణిగానే ఉన్నానని, కానీ పరిస్థితులు మారడంతో నేర్చుకోవాల్సి వచ్చిందని చెబుతోంది. కష్టపడితే ఏ పని అయినా సాధ్యమేనని ఆమె నమ్మకం వ్యక్తం చేస్తోంది. మహిళలు తమపై నమ్మకం ఉంచుకుని, కుటుంబ సభ్యుల సహకారం ఉంటే ఏ రంగంలోనైనా ముందుకు సాగవచ్చని ఆమె సందేశం ఇస్తోంది.
శ్రీలక్ష్మి కృషిని గుర్తించిన జిల్లా అధికారులు ఆమెకు ప్రత్యేక శిక్షణ అవకాశాలు కల్పించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం నేర్చుకునే అవకాశమూ కల్పించారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి చిన్న స్థలం లభిస్తే, సొంతంగా గ్యారేజ్ ఏర్పాటు చేసి స్థిరమైన జీవితం గడపాలని ఆమె ఆశిస్తోంది. కష్టాలను జయించి నిలబడిన శ్రీలక్ష్మి కథ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
ALSO READ: విచిత్ర ఘటన.. పిల్లి పోయిందని పోలీస్ స్టేషన్లో మహిళ ఫిర్యాదు
