* రాష్ట్ర విభజన నాటి నుంచి తెలంగాణలో కలపాలంటున్న ఆ గ్రామాలు
* ఎన్నికల హామీగా విలీన ప్రక్రియ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఐదు గ్రామాల విలీన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. భద్రాచలం పుణ్యక్షేత్రం చుట్టూ ఉన్న ఆ గ్రామాలు ప్రస్తుతం ఏపీలో ఉన్నాయి. భౌగోళికంగా భద్రాద్రి తో విడదీయలేని భాగం కావడంతో వారు తెలంగాణలో కలపాలని గత కొన్నేళ్లుగా కోరుతూ వచ్చారు. అయితే రాజకీయ పార్టీలు సైతం దీనిని ఒక ఎన్నికల హామీగా మార్చేశాయి. అయితే ఇప్పుడు పరిష్కార మార్గం చూపేందుకు తెలుగు రాష్ట్రాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు అర్థమవుతోంది.
స్పందించిన మంత్రి తుమ్మల..
తాజాగా విలీన గ్రామాలకు సంబంధించిన వివాదంపై తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పందించారు. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అంతకుముందు కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి సైతం పార్లమెంట్లో ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చారు. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పెట్టిన బిల్లును మద్దతిస్తూ.. ఈ విలీన గ్రామాల అంశాన్ని ప్రస్తావించారు రేణుకా చౌదరి. దీంతో ఆ ఐదు గ్రామాల ప్రజల ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర విభజన జరిగిన సమయంలోనే ఈ ఐదు గ్రామాలను ఏపీకి కేటాయించారు. అప్పటినుంచి ఆయా గ్రామాల ప్రజలు అభ్యంతరం తెలుపుతూ వచ్చారు. పెద్ద ఎత్తున ఆందోళనలు జరుపుతున్నారు. కానీ వారి ఆశ మాత్రం తీరడం లేదు.
భద్రాచలం రక్షణ కోసం..
ఈ ఐదు గ్రామాలను తెలంగాణలో కలపాలని కోరడానికి ప్రధాన కారణం భద్రాచలం రక్షణ. గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఈ గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఇవి ఏపీలో ఉండడం వల్ల తెలంగాణ ప్రభుత్వం అక్కడ శాశ్వత రక్షణ చర్యలు చేపట్టలేకపోతోంది. ఏపీ ప్రభుత్వం కూడా వీటిపై పెద్దగా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. అందుకే ఈ గ్రామాలు తెలంగాణలో కలిస్తేనే భద్రాద్రికి పూర్తిస్థాయి రక్షణ కల్పించడం సాధ్యం అని రేవంత్ సర్కార్ భావిస్తోంది. అయితే ఇప్పుడు ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కేంద్రానికి లేఖ రాయడం.. అదే పార్టీ ఎంపీ రేణుకా చౌదరి రాజ్యసభలో ప్రస్తావించడం చూస్తుంటే మాత్రం.. ఈ విలీన ప్రక్రియ అనేది కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
ఏపీ నుంచి అభ్యంతరాలు..
విలీన గ్రామాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం లేదు. అదే సమయంలో ఐదు గ్రామాల ప్రజలు పాము ఏపీలో ఉండాలని కోరుకోవడం లేదు. తెలంగాణలో కలపాలని ఉద్యమాలు చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ముంపు ప్రాంతాలు కాని పక్షంలో.. ఆ భూములను తెలంగాణకు అప్పగించడానికి ఏపీకి పెద్దగా ఇబ్బంది ఉండదు. అందుకే ఈ ఐదు గ్రామాలను వదులుకునేందుకు ఏపీ పెద్దగా అభ్యంతరాలు చెప్పదని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే ఈ విలీన గ్రామాల అంశం అంత సులువు కాదు. ఇది సంక్లిష్టమైన ప్రక్రియ కూడా. రెండు రాష్ట్రాల మధ్య సరిహద్దుల మార్పు అనేది కేవలం రాష్ట్రాల మధ్య ఒప్పందంతో ముగిసేది కాదు. ముందుగా రెండు రాష్ట్రాల అసెంబ్లీలో ఈ విలీనానికి ఆమోదం తెలుపుతూ తీర్మానాలు చేయాలి. రాష్ట్రాల తీర్మానాల ఆధారంగా కేంద్ర హోమ్ శాఖ ఒక ముసాయిదాను సిద్ధం చేయాలి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేయాల్సి ఉంటుంది. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతే అధికారికంగా విలీనం జరుగుతుంది. ప్రస్తుతం ఈ అంశం కేంద్రం పరిధిలో ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడం కాదు.. ఏపీని ఒప్పించగలిగితేనే ఈ ఐదు గ్రామాల విలీన సమస్య సాధ్యమవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
