HomeతెలంగాణTelangana: ఆధ్యాత్మిక రాజకీయం...!

Telangana: ఆధ్యాత్మిక రాజకీయం…!

  • హిందుత్వవాదంతో ముందుకు సాగుతున్న రేవంత్

  • గత కాంగ్రెస్ ముఖ్యమంత్రుల వైఖరికి భిన్నం

  • బిజెపి మాస్టర్ ప్లాన్ కు చెక్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. సరికొత్తగా ఇప్పుడు ఆధ్యాత్మిక అస్త్రాన్ని సంధిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు లౌకికవాదం పేరుతో ఆలయ వ్యవహారాలకు దూరంగా ఉండేవారు. కానీ ఈ సంప్రదాయానికి చెక్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. భారతీయ జనతా పార్టీ హిందుత్వవాదంతో తెలంగాణలో చొచ్చుకెళ్లాలని చూస్తోంది. దీనిని గుర్తించిన రేవంత్ తనదైన శైలిలో హిందుత్వ నినాదాన్ని అందిపుచ్చుకున్నారు. కాంగ్రెస్ అంటే కేవలం మైనారిటీల పార్టీ మాత్రమే కాదు. భక్తితో పాటు శక్తి కలయిక అని చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో ఇటువంటి వాదనతోనే ముందుకు సాగారు కేసీఆర్. కానీ ఇప్పుడు రేవంత్ అనూహ్యంగా ఈ నిర్ణయం తీసుకోవడం అటు కెసిఆర్ తో పాటు ఇప్పుడు కాషాయ దళానికి సెగలు పుట్టిస్తోంది.

దక్షిణ అయోధ్యగా భద్రాద్రి…
సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల కీలక ప్రకటన చేశారు. భద్రాద్రిని దక్షిణ అయోధ్యగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. దీని వెనుక లోతైన వ్యూహం కనిపిస్తోంది. ఇటీవల భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయ పునరుద్ధరణ కోసం ఏకంగా రూ.351 కోట్లు తో భారీ మాస్టర్ ప్లాన్ ను సీఎం రేవంత్ స్వయంగా ప్రారంభించారు. ఒక్క భద్రాద్రి లోనే కాదు.. బాసర, వేములవాడతోపాటు మూసీ నది ఒడ్డున ఉన్న ఓంకారేశ్వర ఆలయ అభివృద్ధిని కూడా వందల కోట్ల రూపాయలతో చేపడుతున్నారు. స్వయంగా సమీక్షలు చేస్తూ ఆగమ శాస్త్ర ప్రకారం పనులు జరగాలని అధికారులను ఆదేశించడం విశేషం. తద్వారా హిందుత్వ వాదాన్ని, హిందూ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నట్లు ఆయన తెలంగాణ సమాజానికి సంకేతాలు ఇస్తున్నారు.

బిజెపికి ఛాన్స్ ఇవ్వకుండా…
తెలంగాణలో భారతీయ జనతా పార్టీ బలంగా చొచ్చుకెళ్లేందుకు హిందుత్వ వాదాన్ని ప్రయోగిస్తోంది. అది జరిగితే కాంగ్రెస్ పార్టీకి ప్రమాదకరం. దానిని గుర్తించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆ ఓటు బ్యాంకు బిజెపి వైపునకు వెళ్లకుండా కాంగ్రెస్ వైపు ఉండేలా ప్రయత్నం చేస్తున్నారు. దేవుళ్ళతో పాటు ఆలయాల విషయంలో కాంగ్రెస్ వెనుకబడి ఉందనే ముద్రను తొలగించేందుకు ఆయన అహర్నిశలు శ్రమిస్తున్నారు. యాదాద్రి విమాన గోపురానికి బంగారం తాపడం పనులనుంచి.. వేములవాడ, కొండగట్టు, బాసర సహా అనేక పుణ్యక్షేత్రాల అభివృద్ధి వరకు ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు హిందూ వాటర్లలో కాంగ్రెస్ పట్ల నమ్మకాన్ని బలంగా పెంచుతున్నాయి. బిజెపి ఒక్కదానికే హిందుత్వవాదం కాదు.. కాంగ్రెస్ పార్టీకి సైతం ఉంది అనే విధంగా రేవంత్ రెడ్డి చర్యలు ఉన్నాయి.

మారిన కాంగ్రెస్ స్టాండ్…
తెలంగాణలో ఆధ్యాత్మిక రాజకీయాలు పెరిగాయి. ముఖ్యంగా బీజేపీ హిందుత్వవాదంతో బలంగా ముందుకు వెళ్తోంది. ముందుగా నగరాలు, ఆ తరువాత పట్టణాలు, చివరకు గ్రామాలను ఆవహించే పనిలో ఉంది. అందుకే కాంగ్రెస్ పార్టీ స్టాండ్ మార్చుకుంది. మేం భక్తులం.. బిజెపి భక్తుల ముసుగులో ఉన్న రాజకీయం చేస్తోంది అని మంత్రి పొన్నం ప్రభాకర్ నిండు శాసనసభలో ప్రకటించారు అంటే కాంగ్రెస్ వ్యూహం ఏంటో ఇట్టే అర్థమవుతుంది. మైనారిటీ ఓటు బ్యాంకు చెక్కు చెదరకపోవడం ఒకవైపు.. హిందుత్వ ఓటు బ్యాంకు యూటర్న్ తీసుకోకుండా రేవంత్ ఆధ్యాత్మిక రాజకీయం ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త చర్చకు దారితీస్తోంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు