తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ నిబంధనలు ఇప్పుడు మరింత కఠినతరం చేయబడ్డాయి. ఇప్పటివరకు లైసెన్స్ కోసం రెండు దశల పరీక్షలు మాత్రమే ఉండేవి. మొదట లెర్నర్స్ లైసెన్స్ (ఎల్‌ఎల్‌ఆర్) కోసం పరీక్ష, తర్వాత డ్రైవింగ్ టెస్ట్ ఉంటే, ఆ రెండు దశలు పూర్తి అయిన తర్వాతే డ్రైవింగ్ లైసెన్స్ పొందేవారికి జారీ అవుతుండేది. అయితే సుప్రీంకోర్టు సూచనల మేరకు, ఇప్పుడు ఎల్‌ఎల్‌ఆర్ పరీక్షకు ముందు మరో ఆన్‌లైన్ పరీక్ష రాయాల్సి వస్తోంది. ఈ కొత్త పరీక్ష రోడ్డు భద్రతా అవగాహన పెంపొందించడానికి తీసుకువచ్చారు.
ఇప్పటివరకు లైసెన్స్ కోసం రెండు దశల ప్రక్రియ ఉండేది. అభ్యర్థి ముందుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి ఎల్‌ఎల్‌ఆర్ పరీక్షను రాయాల్సి ఉంటుంది. ఆ పరీక్ష పాస్ అయిన తర్వాతే లెర్నర్స్ లైసెన్స్ జారీ అవుతుంది. ఈ లైసెన్స్ ఆరు నెలలపాటు చెల్లుబాటు అవుతుంది. ఆ సమయంలో అభ్యర్థి డ్రైవింగ్ టెస్ట్ కోసం అప్లై చేసి హాజరుకావాలి. డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయితే, లైసెన్స్ ఇంటి వద్ద స్పీడ్ పోస్టు ద్వారా డెలివరీ అవుతుంది. కానీ ఇప్పుడు ఎల్‌ఎల్‌ఆర్ పరీక్షకు ముందే ఆన్‌లైన్ రోడ్డు భద్రతా అవగాహన పరీక్ష తప్పనిసరిగా రాయాల్సి ఉంటుంది.
కొత్త ఆన్‌లైన్ పరీక్ష మొత్తం ఆరు మాడ్యూల్స్‌లో ఉంటుంది. ఒక్కో మాడ్యూల్ 30 నిమిషాల పాటు ఉంటుంది. మొత్తం పరీక్ష 3 గంటలు కొనసాగుతుంది. ఈ మాడ్యూల్స్‌లో ట్రాఫిక్ నియమాలు, రోడ్డు భద్రతా సూచనలు, వీడియో ఆధారిత పాఠాలు ఉంటాయి. అభ్యర్థులు పరీక్ష సమయంలో ల్యాప్‌టాప్‌లో కెమెరాను ఆన్ చేసి, ప్రత్యక్షంగా పాల్గొనాల్సి ఉంటుంది. కావాలంటే గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్‌లలో కూడా ఈ పరీక్షకు హాజరుకావచ్చు. రవాణాశాఖ అధికారులు స్పష్టం చేసినట్టు, డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే ఈ ఆన్‌లైన్ రోడ్డు భద్రతా అవగాహన పరీక్ష రాయడం తప్పనిసరి.
ALSO READ: సొమ్మసిల్లిన విషసర్పానికి సపర్యలు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా?
