* ఆ పార్టీ వ్యతిరేక, అనుకూల వర్గాలను తన వైపు తిప్పుకునేందుకు నిర్ణయం
* ఏప్రిల్ 25న మేడ్చల్ వేదికగా కొత్త పార్టీ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కల్వకుంట్ల కవిత తన సరికొత్త రాజకీయం ప్రారంభించారు. తన కొత్త పార్టీ తెలంగాణ ప్రజా జాగృతి గురించి కీలక సంకేతాలు ఇచ్చారు. ఏప్రిల్ 25న మేడ్చల్ వేదికగా పార్టీని ప్రకటిస్తానని తేల్చి చెప్పారు. తెలంగాణ ప్రజా జాగృతిని అసలు సిసలైన తెలంగాణ పార్టీగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. గులాబీ పార్టీ పని అయిపోయిందని తేల్చి చెప్పారు. నిజమైన తెలంగాణ ఉద్యమకారులు తన వెంటే ఉన్నారని చెప్పుకొచ్చారు కవిత. తద్వారా బిఆర్ఎస్ కు ఆదిలోనే దెబ్బతీయాలని చూస్తున్నట్టు ఉన్నారు కవిత. పక్కా వ్యూహంతోనే ఆమె అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది. అయితే కవిత ప్రకటనతో గులాబీ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.
ఏ పార్టీకి బీ టీం కాదు
అయితే కవిత ప్రత్యేక వ్యూహం ఏంటి అనేది తెలియడం లేదు. అయితే జాతీయ పార్టీలకు బి టీం అని విమర్శలు వస్తున్న వేళ ఆమె ఫుల్ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో రాజకీయ పార్టీల ఏర్పాటు సమయంలో ఇటువంటి విమర్శలు రావడం సహజమేనని తేల్చి చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారు.. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడిన వారంతా తన వెంట ఉన్నారని చెప్పుకొచ్చారు. తద్వారా గులాబీ పార్టీని ఆమె టార్గెట్ చేసినట్టు కనిపిస్తున్నారు. తెలంగాణను తెచ్చిన పార్టీగా పదేళ్లపాటు పాలించింది గులాబీ పార్టీ అని.. ఇప్పటికీ నీళ్లు, నిధుల విషయంలో ఆ పార్టీ వైఫల్యం కనిపిస్తోందని మండిపడ్డారు. తద్వారా బంగారు తెలంగాణ అనే అంశాన్ని టార్గెట్ చేసుకున్నారు. అదే సమయంలో ఉద్యమ తెలంగాణలో పనిచేసిన నేతలను ఆకర్షించే పనిలో పడ్డారు.
ఫోకస్ అంతా వారిపైనే..
ప్రస్తుతం కల్వకుంట్ల కవిత కేవలం బి ఆర్ ఎస్ పైనే ఫుల్ ఫోకస్ పెట్టారు. ఆ పార్టీ వైఫల్యాలనే ప్రస్తావిస్తున్నారు. తద్వారా ఆ పార్టీ క్యాడర్ను ఆకర్షించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు కనిపిస్తున్నారు. వరుస అపజయాలతో గులాబీ పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశ నిస్పృహలతో గడుపుతోంది. దానిని క్యాచ్ చేసే పనిలో ఉన్నారట కవిత. అందుకే తన తొలి టార్గెట్ ఆ పార్టీ పైనే పెట్టారు. క్రమేపి ప్రజల్లో బలం పెరగడం ద్వారా.. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ తో పాటు బిజెపిని సైతం టార్గెట్ చేయాలనుకుంటున్నారు. ఒక మహిళ నేతగా.. తెలంగాణ సంప్రదాయ జాగృతి వేదికగా కవిత చేసిన రాజకీయాలు వినూత్నంగా ఉంటాయి. ఇప్పుడు కూడా ఆమె అదే ప్రయత్నంలో ఉన్నట్లు అర్థమవుతుంది. కేవలం మూడు వర్గాలను ఆమె టార్గెట్ చేసుకున్నారు. ఉద్యమ తెలంగాణలో పని చేసిన వారు.. యువతతో పాటు మహిళలు ఆమె లక్ష్యంగా కనిపిస్తున్నారు.
ఆ బాధిత వర్గాలే..
కెసిఆర్ పార్టీ ఎవరినైతే నిర్లక్ష్యం చేసిందో వారినే తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు కవిత. అందులో భాగంగానే నిరుద్యోగ యువతను టార్గెట్ చేశారు. నీరు ఇవ్వలేక రైతులకు ఇబ్బంది పెట్టారని ఆరోపణలు చేయడం ద్వారా అన్నదాతలను తన వైపు తిప్పుకునేలా చేశారు. తొమ్మిదేళ్ల కెసిఆర్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన ఉద్యమ తెలంగాణ నేతలను ఆకర్షించే పనిలో పడినట్టు కనిపిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి ద్వారా ఆమె మహిళలకు దగ్గరయ్యారు. వారిని మరింత దగ్గరగా చేర్చుకోవాలన్న ప్రయత్నంలో.. మహిళల సమస్యలను కూడా ప్రస్తావించునున్నారట కవిత. రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్న యువతను సైతం తన పార్టీలో చేర్చుకోవాలని బలమైన ఆకాంక్షతో ఉన్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తుంటే మాత్రం కవిత నుంచి తొలి దెబ్బ గులాబీ పార్టీకేనని స్పష్టమవుతోంది. అయితే గులాబీ పార్టీ లైట్ తీసుకుంటుందా? కవిత విషయంలో సీరియస్ యాక్షన్ లోకి దిగుతుందా? అనేది చూడాలి.
