రాయలసీమ ప్రాంతంతో పాటు పరిసర జిల్లాలపై ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావం వాతావరణ పరిస్థితులను ప్రభావితం చేస్తోందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఈ ప్రభావంతో సోమవారం మరియు మంగళవారం రోజుల్లో రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఈ వర్షాల కారణంగా గత కొన్ని రోజులుగా తీవ్రంగా ఉన్న ఎండ తీవ్రత కొంత మేర తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వాతావరణంలో ఏర్పడుతున్న ఈ మార్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఆకస్మికంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద, బహిరంగ ప్రదేశాల్లో, వ్యవసాయ పొలాల్లో ఉండకూడదని హెచ్చరించారు. పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, కార్మికులు, సాధారణ ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
ఇక మరోవైపు సోమవారం 30-03-26న కొన్ని జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కూడా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లాలోని బాడంగి, మెరకముడిదాం, తెర్లాం, వంగర మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట, గరుగుబిల్లి, జియమ్మవలస, సీతానగరం మండలాలు, పోలవరం జిల్లాలోని చింతూరు, కూనవరం మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వివరించారు. మంగళవారం రోజున కూడా దాదాపు 12 మండలాల్లో ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరించారు. ఒకవైపు వర్షాలు, మరోవైపు వడగాల్పులు ప్రభావం చూపే పరిస్థితి ఉండటంతో వాతావరణంలో తీవ్ర అస్థిరత నెలకొననున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇటీవల నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా రాష్ట్రంలో ఎండ తీవ్రత ఎంతగా పెరిగిందో సూచిస్తున్నాయి. ఆదివారం రోజున మార్కాపురం ప్రాంతంలో 13 చోట్ల, కడపలో 12 చోట్ల, తిరుపతిలో 11 చోట్ల, నెల్లూరులో 11 చోట్ల, చిత్తూరులో 8 ప్రాంతాల్లో సహా మొత్తం 78 ప్రాంతాల్లో 40°C కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లా గూడూరులో 42.4°C, మార్కాపురం జిల్లా నందనమారెల్లలో 42.3°C, కృష్ణా జిల్లా పెద్దపారుపూడిలో 42.1°C, కడప జిల్లా పొట్టిపాడులో 41.9°C, తిరుపతి జిల్లా నాగలాపురం మరియు చిత్తూరు జిల్లా సింధురాజపురంలో 41.7°C, విజయనగరం జిల్లా రాజాంలో 41.2°C నమోదయ్యాయి. అలాగే పల్నాడు జిల్లా నూజెండ్ల, ప్రకాశం జిల్లా కొండపి, నంద్యాల ప్రాంతాల్లో 40.8°C, తూర్పుగోదావరి జిల్లా చిట్యాలలో 40.4°C, కర్నూలు జిల్లా తోవిలో 40.2°C, శ్రీకాకుళం జిల్లా కొల్లువలసలో 40.1°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ స్థాయిలో ఎండలు నమోదవుతున్న పరిస్థితిలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
ఇటువంటి విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత అవసరం. వేడి ఎక్కువగా ఉన్న సమయంలో బయటకు వెళ్లడం తగ్గించడం, తగినంత నీరు తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం, అలాగే వర్షాలు పడే సమయంలో సురక్షిత ప్రదేశాల్లో ఉండడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. రైతులు కూడా పంటలను రక్షించుకునేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ వాతావరణ మార్పులు తాత్కాలికమైనవే అయినప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు మరోసారి స్పష్టం చేస్తున్నారు.
ALSO READ: ఇరాన్‌తో యుద్ధం.. అమెరికాకు ఎన్ని వేల కోట్ల నష్టమంటే?
