-
సింగరేణి మనుగడకు కొత్తబావులు ఏర్పాటు చేయాలి
మంచిర్యాల, క్రైమ్ మిర్రర్: సింగరేణిలో ప్రకృతికి విరుద్ధంగా బొగ్గుబావుల్లో పని చేస్తున్న ఉద్యోగుల హక్కులను క్రమంగా కాలరాస్తూ ప్రభుత్వం యాజమాన్యాలు ఉక్కుపాదం మోపుతుంటే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు ఏం చేస్తున్నాయని టీబీజీకేఎస్ యూనియన్ కేంద్ర కమిటి ఉపాధ్యక్షులు ఓ. రాజశేఖర్, ఏరియా ఉపాధ్యాక్షులు మేడిపల్లి సంపత్ లు ధ్వజమెత్తారు. శనివారం ఏరియా వర్కుషాపులో నిర్వహించిన గేటుమీటింగ్లో వారు మాట్లాడారు.
సింగరేణిలో మెడికల్ బోర్డు నిలిచిపోయి పది నెలలు కావస్తుందని తక్షణమే అమలు చేసి అనారోగ్యంతో బాదపడుతున్న ఉద్యోగులను కాపాడాలన్నారు. అంతేగాకుండా సింగరేణి ఆర్థిక సంక్షోభం లోకూరుకపోయిందని దీనిని దృష్టిలో పెట్టుకొని సంస్థకు బాకీ ఉన్నటువంటి 50వేల కోట్ల బకాలు లు వెంటనే చెల్లించాలన్నారు. సింగరేణి మనుగడ కోసం కొత్తబావులను ఏర్పాటు చేయాలని కోరారు.
ఇటీవల ప్రభుత్వం మెడికల్ ఇన్‌వాలిడేషన్‌పై చేసినటువంటి సీబీ సీఐడీ విచారణ చేయాలని ప్రకటన చేయడం సరికాదన్నారు. సంస్థ అభివృద్ధికి చర్యలు చేపట్టాల్సినటువంటి ప్రభుత్వం కార్మికులను ఉద్యోగులను అయోమయానికి గురి చేయడం సరికాదన్నారు. ప్రజా ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేయాలన్నారు.
సింగరేణిలో గుర్తింపు సంఘం ఏఐటీయుసీ, ఐఎన్టీయుసీ విధానాన్ని కార్మికులు నిలదీయాలన్నారు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం తాము త్యాగాలకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.ఈ సమావేశంలో నాయకులు కొండల్ రావు, లక్ష్మణ్, ఇప్ప సమ్మయ్య, తోట రాజిరెడ్డి, వై. శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
