విధేయత చాటుకున్న కాంగ్రెస్ నేత మైనంపల్లి..
టిడిపి నుంచి తొలిసారిగా అసెంబ్లీకి అవకాశం..
అందుకే నాయకత్వం పట్ల ఆయనకు అభిమానం..
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో రాణిస్తున్న చాలామంది నేతలు తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారే. టిడిపి మూలాలు ఉన్నవారే. ప్రత్యేక రాష్ట్ర సెంటిమెంట్ తో వారంతా తెలుగుదేశం పార్టీని వీడాల్సి వచ్చింది. అయినా సరే వారు టిడిపి నాయకత్వం పట్ల విధేయత కనబరుస్తూ వస్తున్నారు. అటువంటి వారిలో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఒకరు.
ఇటీవల ఏపీ టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర ఇంట్లో వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ నేత మైనంపల్లి హనుమంతరావు ముందుకు వచ్చి అందరి సమక్షంలో సీఎం చంద్రబాబుకు పాదాభివందనం చేశారు. తనకు ఉన్న కృతజ్ఞతను చాటుకున్నారు.
సోషల్ మీడియాలో వైరల్..
అయితే తెలంగాణ కాంగ్రెస్ నేత సీఎం చంద్రబాబుకు పాదాభివందనం చేయడంతో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అయితే పూర్వాశ్రమంలో మైనంపల్లి హనుమంతరావు టిడిపిలో పనిచేశారు. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ ద్వారా అసెంబ్లీలో అడుగుపెట్టారు. అందుకు కారణం చంద్రబాబు.
తనకు రాజకీయ జీవితం ఇచ్చిన చంద్రబాబును ఏ పార్టీలో ఉన్న గుర్తించుకుంటానని పలు సందర్భాల్లో చాటి చెప్పారు మైనంపల్లి హనుమంతరావు. 2023లో చంద్రబాబు అరెస్టు జరిగింది. అప్పుడు గులాబీ పార్టీలో ఉన్నారు మైనంపల్లి. ఆ సమయంలో చంద్రబాబు అరెస్ట్ కు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఐటి ఉద్యోగులు ప్రయత్నాలు చేశారు.
కానీ అప్పటి మంత్రి కేటీఆర్ అనుమతి ఇవ్వలేదన్న వార్తలు వచ్చాయి. ఏపీలో అరెస్టులకు ఎక్కడ నిరశనలు తెలపడం ఏమిటి అన్న వ్యాఖ్యలు కేటీఆర్ నుంచి రావడంతో అప్పట్లో వివాదాస్పదంగా మారింది. కానీ ఆ సమయంలోనే చంద్రబాబు అరెస్టును ఖండించారు మైనంపల్లి హనుమంతరావు. అప్పటి కెసిఆర్ మిత్రుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి పైనే నేరుగా విమర్శలు చేశారు. అంతలా విధేయత చాటుకున్నారు మైనంపల్లి హనుమంతరావు.
టిడిపి ద్వారానే..
1998లో తెలుగుదేశం పార్టీలో చేరారు మైనంపల్లి. 2008లో రామయంపేట నియోజకవర్గ ఉప ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు తెలుగుదేశం పార్టీ తరఫున. అలా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి టిడిపి తరఫున పోటీ చేసి గెలిచారు.
2014 ఎన్నికల్లో బిజెపితో పొత్తులో భాగంగా మల్కాజిగిరి అసెంబ్లీ స్థానాన్ని వదులుకోవాల్సి వచ్చింది టిడిపి. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ లభించలేదు. దీంతో తిరిగి గులాబీ పార్టీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి టిడిపి అభ్యర్థి మల్లారెడ్డి చేతిలో ఓడిపోయారు.
2018 ఎన్నికల్లో తనతో పాటు తన కుమారుడికి టికెట్ కావాలని అడిగారు. అందుకు అంగీకరించకపోవడంతో మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. కానీ టిడిపి నాయకత్వం పట్ల మాత్రం అభిమానం తగ్గలేదు. అందుకే చంద్రబాబుకు మైనంపల్లి పాదాభివందనం చేశారు.
