తనను తాను ప్రూవ్ చేసుకున్న యువ నేత
ఇదే మంచి సమయంగా భావిస్తున్న బాబు
నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రకటన
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ లు ప్రమోషన్ దక్కనుందా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన నియామకం ఉంటుందా? నేడు పార్టీ ఆవిర్భావ దినోత్సవ నాడు ఈ ప్రకటన రానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. చాలా రోజులుగా లోకేష్ కు ప్రమోషన్ ఇవ్వాలని పార్టీలో డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ఈ తరుణంలో టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ పేరును ఈరోజు ప్రకటించనున్నారని పొలిటికల్ వర్గాల్లో సరికొత్త చర్చ నడుస్తోంది.
ఏ వారసుడుకి లేనంతగా వ్యతిరేకత..
చంద్రబాబు వారసుడిగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు నారా లోకేష్. 2009 ఎన్నికల్లో తెరవెనుక నుంచి పార్టీకి పనిచేశారు. కానీ ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. అయినా సరే పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు తెర వెనుక గట్టి ప్రయత్నాలు చేశారు నారా లోకేష్. స్వతహాగా విద్యాధికుడు అయిన నారా లోకేష్ 2014 ఎన్నికల్లో ప్రత్యక్షంగానే టిడిపికి సేవలు అందించడం ప్రారంభించారు.
ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో లోకేష్ పాత్ర టిడిపిలో పెరిగింది. ఆయనను ముందుగా ఎమ్మెల్సీ ని చేశారు చంద్రబాబు. తరువాత తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. దేశంలో సీనియర్ నేతల వారసుల మాదిరిగానే.. లోకేష్ చంద్రబాబు వారసుడిగా ఎంట్రీ ఇచ్చారు.
ఈ క్రమంలో ఆయన చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థులకు శత్రువుగా మారిపోయారు. లోకేష్ వ్యక్తిత్వ హననానికి గురయ్యారు. లోకేష్ ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసిన వారే అధికం. ఎన్నెన్నో అవమానాలు గురయ్యారు. కానీ వాటిని మౌనంగా భరిస్తూ వచ్చారు లోకేష్.
ఒక్క ఓటమితో మార్పు..
ఒక ఓటమి ఎంత మార్పు తీసుకురావాలో లోకేష్ లో అది కనిపించింది. రాష్ట్ర మంత్రిగా ఉంటూ, ఒక ముఖ్యమంత్రి కుమారుడిగా ఉంటూ మంగళగిరిలో పోటీ చేసిన లోకేష్ ఓడిపోయారు. అయితే అదే ఆయన రాజకీయ జీవితానికి టర్నింగ్ పాయింట్. అసలు తెలుగుదేశం పార్టీ గెలిచే నియోజకవర్గం మంగళగిరి కాదు. అటువంటి నియోజకవర్గాన్ని ఎంచుకొని సాహసం చేశారు.
అయితే ఆ ఓటమితో ప్రత్యర్థులకు మరింత టార్గెట్ అయ్యారు. విపరీతంగా లక్ష్యంగా పెట్టుకున్నారు ప్రత్యర్థులు. అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి కిందిస్థాయి నేత వరకు లోకేష్ పై విమర్శలు చేయని నేతలంటూ లేరు. కానీ వాటన్నింటినీ తట్టుకొని నిలబడ్డారు లోకేష్. ముళ్ళతోపాటు రాళ్లు రప్పలను దాటుకొని రాజకీయంగా తాను అనుకున్నది సాధించారు.
పాదయాత్రతో పెరిగిన పరిణితి..
నారా లోకేష్ లో రాజకీయ పరిణితి పెరగడానికి దోహద పడింది పాదయాత్ర. పార్టీ కోసం.. పార్టీ పూర్వవైభవం కోసం లోకేష్ సుదీర్ఘ పాదయాత్రకు దిగారు. కానీ పాదయాత్రను కూడా అడ్డగించేందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేయని ప్రయత్నం అంటూ లేదు.
లోకేష్ అడుగడుగునా ఇబ్బందులు పడ్డారు. కానీ ఆ ఇబ్బందులను మౌనంగా ఓర్చుకున్నారు.. పాదయాత్ర మధ్యలో తండ్రి చంద్రబాబు అరెస్టయ్యారు. అయినా మానసిక ధైర్యాన్ని కోల్పోలేదు. అనుకున్న లక్ష్యం మేరకు పాదయాత్రను పూర్తి చేయగలిగారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు దోహదపడ్డారు.
గత అనుభవాల దృష్ట్యా నారా లోకేష్ మంత్రి పదవి చేపట్టకూడదని టిడిపి శ్రేణులు కోరుకున్నాయి. ఎందుకంటే 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ మంత్రి పదవి కాకుండా.. పార్టీ పగ్గాలు తీసుకుంటే మంచి జరిగేది అన్న అభిప్రాయం ఉండేది. నాడు ప్రభుత్వాన్ని నడిపిన చంద్రబాబు పార్టీని గాలికి వదిలేసారన్న విమర్శ ఉంది.
అందుకే ఈసారి లోకేష్ పార్టీని చూసుకుంటే.. చంద్రబాబు ప్రభుత్వాన్ని నడుపుతారని పార్టీ శ్రేణులు కోరుకున్నాయి. కానీ చేతిలో పవర్ ఉంటే కానీ అనుకున్నది సాధించలేమని చంద్రబాబు భావించారు. అందుకే లోకేష్ కు కీలకమైన పాఠశాల విద్యాశాఖను అప్పగించారు.
కానీ లోకేష్ విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలోనూ.. రాష్ట్ర ప్రభుత్వం పరంగా చక్కటి పనితీరు కనబరచడంలోనూ.. పార్టీని సమన్వయంగా ముందుకు తీసుకెళ్లడంలోనూ.. కూటమి సమన్వయాన్ని కాపాడడంలోనూ తనదైన పాత్ర పోషిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే పార్టీని ఒంటి చేత్తో ఇప్పుడు నడిపిస్తున్నారు లోకేష్. అందుకే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు అప్పగించేందుకు ఇదే సరైన సమయం అని చంద్రబాబు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది..
