క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత అంశంపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు అసలు పార్టీ మారలేదని ఇటీవల స్పీకర్ ఇచ్చిన క్లీన్ చిట్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై కోర్టు ఈ స్పందన తెలిపింది.
అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు, ఫిరాయింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు బుధవారం (మార్చి 25, 2026) నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందుకున్న వారిలో దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు ఉన్నారు. స్పీకర్ నిర్ణయంపై తమ వివరణతో కూడిన కౌంటర్ అఫిడవిట్లను దాఖలు చేయాలని కోర్టు వారిని ఆదేశించింది.
ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 16, 2026కు కోర్టు వాయిదా వేసింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ అలోక్ అరధే ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
