Thursday, March 26, 2026
Homeఆంధ్ర ప్రదేశ్Amaravati: అమరావతికి చట్టబద్ధత.. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం!

Amaravati: అమరావతికి చట్టబద్ధత.. ఏపీ అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం!

* ఈనెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

* ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి నివేదిక

* పార్లమెంట్ సమావేశాల్లో కీలక నిర్ణయం తీసుకోనున్న కేంద్రం

* ఇక కదిలించలేని స్థితికి ఏపీ రాజధాని

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: అమరావతికి శాశ్వతం అనే పదం జోడించాలని కూటమి ప్రభుత్వం స్ట్రాంగ్ గా నిర్ణయం తీసుకుంది. గత అనుభవాల దృష్ట్యా అమరావతికి చట్టబద్ధత తీసుకురావాలన్న నిర్ణయానికి వచ్చింది. ఏకాభిప్రాయంతో అమరావతి రాజధాని నిర్మాణం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అనేది అపహాస్యంగా మారింది. పూర్తిగా నిర్వీర్యం అయింది. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. దీంతో ఐదేళ్లపాటు అమరావతి రాజధాని వెనక్కి వెళ్ళిపోయింది. అలాగని మూడు రాజధానులు అనేవి అమలు కాలేదు. ఇటువంటి తరుణంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి పూర్వ వైభవం వచ్చింది. అయితే అమరావతికి భూములు ఇచ్చిన రైతుల్లో మాత్రం అదే భయాందోళన నెలకొంది. ఒకవేళ అధికార మార్పిడి జరిగితే మళ్లీ అమరావతికి కదలిక వస్తుందని వారిలో ఒక రకమైన భయం వెంటాడుతూ వచ్చింది. అందుకే కూటమి ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. దేశంలో ఏ రాజధానికి లేనివిధంగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని సరికొత్త ఆలోచన తెరపైకి వచ్చింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించగలిగింది కూటమి ప్రభుత్వం.

అసెంబ్లీ ప్రత్యేక సమావేశం..

ఈనెల 28న ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. ఆరోజు ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే అసెంబ్లీకి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హాజరు కావడం లేదు. అయినా సరే ఈ సమావేశం నిర్వహించడానికి సహేతుకమైన కారణం ఉంది. అదే అమరావతి రాజధాని. ఈనెల 28న అసెంబ్లీ సమావేశానికి కూటమి పార్టీల ఎమ్మెల్యేలంతా హాజరుకావాలని ప్రత్యేక వర్తమానం అందించింది కూటమి ప్రభుత్వం. ఆరోజు అమరావతి ఏకైక రాజధాని అంటూ తీర్మానం చేస్తూ ఏపీ అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వానికి ఒక తీర్మానం పంపించనుంది. ఆ తీర్మానాన్ని గౌరవించి కేంద్ర ప్రభుత్వం ఒక చట్టబద్ధత కల్పించనుంది  అమరావతికి. ఇక అధికారం మారినా.. బలమైన ప్రభుత్వాలు వచ్చినా.. అమరావతిని కదిలించలేని స్థితిలో పెట్టనున్నారన్నమాట. అదే జరిగితే ఇక అమరావతి శాశ్వతం.

ఏకాభిప్రాయంతో అమరావతి..

2014లో రాష్ట్ర విభజన జరిగింది. ఏకాభిప్రాయంతో అమరావతి రాజధాని ఎంపిక జరిగింది. అందుకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం అంగీకారం తెలిపారు. అమరావతికి మరిన్ని భూములు సేకరించాలని సూచనలు కూడా చేశారు. కానీ అదే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మార్చారు. అమరావతి అనేది ఏకైక రాజధాని కాదు.. పాలనా వికేంద్రీకరణకు ఈ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరం అని తేల్చి చెప్పారు. అంతకు ముందున్న ప్రభుత్వం నిర్ణయాన్ని మార్చేశారు. ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా తన నిర్ణయాన్ని అమలు చేసేందుకు ప్రయత్నం చేశారు. కానీ సాంకేతికంగా అది వీలు కాలేదు. చట్టపరంగా అడుగడుగునా ఇబ్బందులు ఎదురయ్యాయి. తాను అనుకున్న మూడు రాజధానులను ఏర్పాటు చేయలేక.. టిడిపి ప్రభుత్వం నిర్ణయించిన అమరావతి రాజధాని నిర్మాణం చేయలేక.. ఐదేళ్లపాటు ఇట్టే కాలాన్ని గడిపేశారు. దానిని ఏపీ ప్రజలు తప్పు పడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజాక్షేత్రంలో శిక్షించారు.

అమరావతి రైతుల డిమాండ్ అదే..

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతికి కొత్త సందడి ప్రారంభమైంది. అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు శరవేగంగా ప్రారంభం అయ్యాయి. అయితే ఎక్కడో ఒక అనుమానం. అదే సమయంలో హైదరాబాద్ ఉమ్మడి రాజధాని గడువు ముగుస్తోంది. ఇటువంటి తరుణంలో ఏపీ రాజధానికి చట్టబద్ధత కావాలి. కదిలించలేని స్థితికి చేరాలి. ఇప్పుడు సీఎం చంద్రబాబు చేస్తోంది అదే. ఈనెల 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి అమరావతిని ఏకైక రాజధానిగా ప్రతిపాదించనున్నారు. ప్రత్యేక తీర్మానం చేసి కేంద్రానికి నివేదించనున్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోనుంది. ఇది నిజంగా ఏపీకి శుభపరిణామమే.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments