HomeతెలంగాణKTR- Formula E Car Case: కేటీఆర్ చుట్టూ ఉచ్చు.. చార్జ్ షీట్ దాఖలు...

KTR- Formula E Car Case: కేటీఆర్ చుట్టూ ఉచ్చు.. చార్జ్ షీట్ దాఖలు చేసిన ఏసీబీ!

* ఫార్ములా ఈ కార్ రేసులో ఏ 1 నిందితుడు

* కేసు విచారణలో అనేక మలుపులు  

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్ పై ఫోకస్ పెట్టిందా? ఆయనను కేసులతో ఉక్కిరి బిక్కిరి చేయనుందా? ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏ1 గా ఏసీబీ చార్జ్ షీట్ అందులో భాగమేనా? కేటీఆర్ అరెస్టు తప్పదా? తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే చర్చ నడుస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ కార్ రేస్ కేసు పై చర్చ నడుస్తూనే ఉంది. కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగిస్తూనే ఉంది. అయితే తాజాగా ఏసీబీ అధికారులు నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేయడం సంచలనంగా మారింది. ఏకంగా ఈ కేసులో ఏ 1గా కేటీఆర్ ను చూపించగా.. ఏ 2 గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ 3 గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బి ఎల్ ఎన్ రెడ్డి, a4 గా స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఏ 5 గా యు కేకు చెందిన ఫార్ములా ఈ ఆపరేషన్ సంస్థను చూపడం చూస్తుంటే కేసు బిగుసుకున్నట్టుగానే ఉంది. నిబంధనలకు విరుద్ధంగా రూ.55 కోట్లను విదేశీ సంస్థలకు నేరుగా మళ్ళించినట్లు చార్జ్ షీట్ లో  పేర్కొన్నారు.

కేటీఆర్ కోసమే?

అయితే ఈ కేసు పూర్తిగా కేటీఆర్ మెడకు చుట్టుకునే పరిస్థితి కనిపిస్తోంది. ఈ కేసులో కేటీఆర్ ను విచారించేందుకు గతంలో గవర్నర్ అనుమతి కూడా తీసుకున్నారు. క్యాబినెట్లో సుదీర్ఘంగా చర్చించి కేటీఆర్ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్లాలని కూడా నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి 2024 డిసెంబర్ 18న ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీని ఆధారంగా ఈ డిసైతం మరో కేసు నమోదు చేసింది. ఇది పూర్తిగా నేరపూరిత కుట్ర అని.. ఇతరులకు లాభం కలిగించేలా వ్యవహరించారని ఏసీబీ అభియోగాలు మోపింది. అయితే వరుస కేసులతో గులాబీ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేయాలన్నది కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.

విదేశీ సంస్థపై సైతం..

2023 ఫిబ్రవరిలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హుస్సేన్ సాగర్ వద్ద ఫార్ములా ఈ కారు రేస్ నిర్వహించారు. అయితే ఈ కేసులో అనేక ట్విస్టులు ఉన్నాయి. తొలుత నిర్వహణకు సంబంధించి ఒక సంస్థతో ఒప్పందాలు చేసుకుంటే అది తప్పుకుంది. తరువాత విదేశీ సంస్థలు ప్రవేశించాయి. ఇప్పుడు అదే అంశాన్ని తీసుకుని ఏసీబీ విచారణ కొనసాగుతోంది. అయితే ఈ కేసు దర్యాప్తు అంత ఈజీగా తేలే అవకాశం లేదు. రేసు నిర్వహణ సంస్థ విదేశాల్లో ఉండడం.. ఆ సంస్థ ప్రతినిధులను విచారించకుండా కేసు ముగించడం సాధ్యం కాదు. ఏసీబీకి విచారించే అధికారం లేకపోవడంతో ఆన్లైన్లో విచారించి ఆ వివరాలను చార్జిషీట్లో పేర్కొంది. మరోవైపు అరవింద్ కుమార్ ఐఏఎస్ అధికారి కావడంతో ప్రాసిక్యూట్ చేయడానికి డిఓపిటి అనుమతి తీసుకుంది. అదే సమయంలో కేటీఆర్ ప్రజాప్రతినిధి కావడంతో గవర్నర్ అనుమతి కోరింది. అయితే ఈ అనుమతులు లభించడంతో ఇప్పుడు ఈ కేసులో చార్జ్ షీట్  దాఖలు చేసింది ఏసీబీ. విదేశీ సంస్థకు ముడిపడిన అంశం కావడంతో విచారణ సులువుగా తేలుతుందా? లేదా? అన్నది చూడాలి.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు