Homeఅంతర్జాతీయంగ్యాస్ సిలిండర్ల ధరలు ఇంకా పెరుగుతాయా?

గ్యాస్ సిలిండర్ల ధరలు ఇంకా పెరుగుతాయా?

మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మళ్లీ భగ్గుమన్న నేపథ్యంలో ఖతార్‌లోని కీలక పారిశ్రామిక కేంద్రం రాస్ లఫాన్‌పై ఇరాన్ జరిపిన దాడులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గంభీర హెచ్చరికగా మారాయి. ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తి, ఎగుమతి కేంద్రంగా గుర్తింపు పొందిన ఈ ప్రాంతంపై జరిగిన దాడుల ప్రభావం కేవలం ఖతార్‌కే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎనర్జీ రంగంపై పడే అవకాశముంది. ఈ ఘటనపై స్పందించిన ఖతార్ ఇంధన శాఖ మంత్రి సాద్ అల్ కాబీ, ఈ దాడుల వల్ల మధ్యప్రాచ్య ప్రాంతంలోని గ్యాస్ ఎగుమతి సామర్థ్యం గణనీయంగా దెబ్బతింటుందని, దీని కారణంగా బిలియన్ల డాలర్ల మేర ఆర్థిక నష్టం సంభవించే అవకాశముందని హెచ్చరించారు.

ఇరాన్ మార్చి 18న రాత్రి తొలి దాడిని ప్రారంభించగా, సహజ వాయువును శుద్ధి చేసి ద్రవ ఇంధనాలుగా మార్చే పెర్ల్ జీటీఎల్ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని 5 బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడితో ఆ ప్లాంట్‌కు తీవ్ర నష్టం వాటిల్లింది. అనంతరం పైప్‌లైన్ వ్యవస్థలు, నిల్వ ట్యాంకులను లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల వల్ల ఉత్పత్తి ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయినట్లు సమాచారం. ఆ తరువాత మార్చి 19న మరోసారి దాడికి దిగిన ఇరాన్, రాస్ లఫాన్ ప్రాంతంలోని అనేక గ్యాస్ యూనిట్లను లక్ష్యంగా చేసుకుంది. ఇందులో 2 ప్రధాన ఉత్పత్తి యూనిట్లు, మొత్తం 14 ట్రాన్స్ గ్యాస్ యూనిట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ దాడులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన కాబీ, పవిత్ర రంజాన్ మాసంలో ఒక ముస్లిం దేశం చేత ఇలాంటి దాడి జరుగుతుందని ఊహించలేదని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాల వల్ల ఖతార్ గ్యాస్ ఎగుమతి సామర్థ్యంలో సుమారు 17% నష్టం వాటిల్లిందని, దీని ఫలితంగా సంవత్సరానికి దాదాపు రూ.1,60,000 కోట్లకు సమానమైన $20 బిలియన్ ఆదాయం కోల్పోయే ప్రమాదం ఉందని వెల్లడించారు. అంతేకాకుండా మరమ్మతుల కారణంగా రాబోయే 3 నుండి 5 సంవత్సరాల పాటు సుమారు 12.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు.

ఈ దాడుల ప్రభావం ప్రపంచంలోని అనేక దేశాలపై పడే అవకాశముంది. ముఖ్యంగా భారత్ తన గ్యాస్ అవసరాల్లో సుమారు 40-50% ను ఖతార్ నుండి దిగుమతి చేసుకుంటోంది. సరఫరా తగ్గితే దేశంలో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు పెరగడం ఖాయం. అదే సమయంలో ఎల్‌పీజీ ఉత్పత్తి కూడా సహజ వాయువుతో సంబంధం ఉండటంతో గృహ వినియోగ సిలిండర్ల ధరలపై కూడా ప్రభావం పడే అవకాశముంది. పెరుగుతున్న అంతర్జాతీయ ముడి చమురు, గ్యాస్ ధరలు దేశీయ వినియోగదారులపై అదనపు భారం మోపవచ్చు.

భారతదేశానికి సమీపంలోని పాకిస్తాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలు ఇప్పటికే ఇంధన సంక్షోభంతో పోరాడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సరఫరా మరింత తగ్గితే, ప్రపంచ మార్కెట్లో ధరలు పెరిగితే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు మరింత ఒత్తిడిని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఇదే సమయంలో చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి ఆసియా దేశాలు కూడా ఖతార్ నుండి భారీగా గ్యాస్‌ను దిగుమతి చేసుకుంటున్నాయి. 2025లో ఖతార్ మొత్తం ఎగుమతుల్లో 90% వాటా ఈ దేశాలదే కావడంతో, సరఫరా అంతరాయం ఏర్పడితే స్పాట్ మార్కెట్లో అధిక ధరలకు గ్యాస్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది.

అదేవిధంగా ఐరోపా దేశాలు కూడా ఈ ప్రభావం నుంచి తప్పించుకోలేవు. ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత గ్యాస్ సరఫరా కోసం ఖతార్‌పై ఆధారపడిన ఐరోపా దేశాలకు ఇప్పుడు ఈ దాడులు మరింత భారంగా మారే అవకాశం ఉంది. రాస్ లఫాన్ కేంద్రంపై జరిగిన దాడి కారణంగా ఐరోపాలో గ్యాస్ ధరలు 30-35% వరకు పెరిగే అవకాశముందని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఈ పరిణామం ప్రపంచ ఎనర్జీ మార్కెట్‌ను కుదిపేసే అవకాశం ఉండగా, దీని ప్రభావం త్వరలోనే వినియోగదారుల జేబులపై స్పష్టంగా కనిపించే అవకాశముంది.

ALSO READ: మత్తువదలరా-2 బ్యూటీని చూశారా భయ్యా?

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు