సోషల్ మీడియా కోసం వింత ప్రయోగాలు చేసే ఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. వ్యూస్, లైకులు, ఫాలోయింగ్ కోసం కొందరు ఎంతకైనా సిద్ధమవుతున్నారని మరోసారి రుజువైంది. తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటుచేసుకున్న ఒక ఘటన అందరినీ షాక్‌కు గురిచేసింది. ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు రీల్స్ కోసం చేసిన పని ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది.
We live in a weird weird world. Daughter & family pack father in a gunny bag,take him to a courier office,ask staff to send parcel out of Bengaluru, all this for a reel showing it's easier to courier a man than get bus & train tickets this festive season. Land in police station. pic.twitter.com/ROz2SWjFpT
— Deepak Bopanna (@dpkBopanna) March 17, 2026
బెంగళూరులోని ఒక కొరియర్ కార్యాలయానికి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు వెళ్లి, ఒక పెద్ద మూటను పార్శిల్‌గా పంపించాలని కోరారు. అయితే ఆ మూటలో ఏముందో చెప్పడానికి వారు నిరాకరించడంతో కొరియర్ సిబ్బందికి అనుమానం కలిగింది. వెంటనే వారు ఆ మూటను తెరిచి చూడగా, అందులో ఒక వృద్ధుడు ఉన్నాడు. ఇది చూసిన సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఆ వ్యక్తిని బయటకు తీసినప్పుడు ఆయన తీవ్రంగా ఊపిరి పీల్చుకుంటూ కనిపించాడు. మూటలో బిగించి పెట్టడంతో ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడినట్టు తెలుస్తోంది.
ఆ వృద్ధుడు ఎవరు అనే విషయాన్ని సిబ్బంది ప్రశ్నించగా, అతనే తమ తండ్రి అని అక్కడికి వచ్చిన యువతి తెలిపింది. ఈ సంఘటన వెనుక ఉన్న కారణం గురించి అడిగితే, సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం కోసం ఇలా చేశామని కుటుంబ సభ్యులు వెల్లడించారు. అంతేకాకుండా, ఉగాది, రంజాన్ వంటి పండుగల సమయంలో ప్రయాణించడం కంటే పార్శిల్ పంపడం సులభమని సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ పని చేశామని వారు చెప్పారు.
అయితే ఈ వివరణ సిబ్బందిని మరింత ఆగ్రహానికి గురిచేసింది. మానవ ప్రాణాలను ప్రమాదంలో పెట్టే విధంగా వ్యవహరించడం తీవ్ర నిర్లక్ష్యంగా భావించిన కొరియర్ సంస్థ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తరువాత తమ తప్పును గ్రహించిన ఆ కుటుంబ సభ్యులు క్షమాపణలు కోరినట్టు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను కొరియర్ సంస్థ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వేగంగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియా కోసం ఇలాంటి ప్రమాదకర చర్యలు చేయడం ఎంతవరకు సమంజసం అనే ప్రశ్న ఇప్పుడు మరోసారి ముందుకు వచ్చింది. లైకులు, ఫాలోయింగ్ కోసం మానవ ప్రాణాలను సైతం పణంగా పెట్టే పరిస్థితి సమాజంలో ఆందోళన కలిగిస్తోంది.
ALSO READ: డెస్క్ జాబ్ చేసే వారి కోసం కూర్చున్న చోటే సింపుల్ స్ట్రెచెస్
