హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలంగాణ రాజకీయాల్లో మల్లారెడ్డిది ప్రత్యేకమైన స్థానం అని చెప్పవచ్చు. కష్టపడ్డా, పాలు అమ్మిన, పువ్వులు అమ్మిన, ఫేమస్ అయ్యిన.. అని చెప్పుకుంటూ ఉంటారు కాని ఆయన ప్రజల్లోకి వెళ్లే విధానంలో ప్రత్యేకత ఉంది. టీడీపీ నుంచి మల్కాజిగిరి ఎంపీగా ఎన్నికైన ఆయన ఇప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అల్లుడ్ని కూడా ఎమ్మెల్యే చేశారు.
అయితే ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరమవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అందుకే కోడలు ప్రీతిరెడ్డిని ప్రోత్సహిస్తున్నారు. ఆమె కూడా ఆసక్తిగా ఉన్నారు. ఇంటర్యూలు ఇస్తూ తాను ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమవుతున్నట్లుగా సంకేతాలిస్తున్నారు. మ ల్లారెడ్డి కుమారుడు భద్రా రెడ్డి భార్య అయిన ప్రీతిరెడ్డి గత కొంతకాలంగా మేడ్చల్ నియోజకవర్గంలో చురుగ్గా కనిపిస్తున్నారు.
వృత్తిరీత్యా వైద్యురాలైన ఆమె విద్యా సంస్థల నిర్వహణలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. మల్లారెడ్డి వయసు రీత్యా రాజకీయాలకు దూరమవ్వాలని భావిస్తుండటంతో తన వారసురాలిగా కోడలిని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఆమె తన మాటతీరుతో ప్రజలను ఆకట్టుకుంటూ రాజకీయ నాయకురాలికి ఉండాల్సిన లక్షణాలను ప్రదర్శిస్తున్నారు.ప్రస్తుతం మల్లారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు.
ప్రీతి రెడ్డి బీజేపీ వైపు….
మల్లారెడ్డి కోడలు ప్రీతి రెడ్డి భారతీయ జనతా పార్టీ వైపు ఆసక్తి చూపిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆమె ఇచ్చే ఇంటర్వ్యూలలో బీజేపీ సిద్ధాంతాలను సమర్థించడం కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలను ప్రశంసించడం గమనిస్తే ఆమె రాజకీయ గమ్యం ఖరారైందని అర్థమవుతోంది. మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ తరపున పోటీ చేయాలని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ప్రీతిరెడ్డి కేవలం మల్లారెడ్డి కోడలిగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకుంటున్నారు.
విద్యావంతురాలు కావడం మల్లారెడ్డి గ్రూపు సంస్థల నిర్వహణలో అనుభవం ఉండటం ఆమెకు కలిసి వచ్చే అంశాలు. రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత పెరగాలని ఆమె గట్టిగా వినిపిస్తున్నారు. సామాజిక అంశాలపై ఆమెకు ఉన్న అవగాహన విశ్లేషణాత్మక ధోరణి ఆమెను ఇతర రాజకీయ వారసుల కంటే భిన్నంగా నిలబెడుతున్నాయి. రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం పదవుల కోసం కాదని ప్రజా సేవ చేయడమే తన లక్ష్యమని ఆమె చెబుతూ ముందుక సాగుతున్నారు.
అన్ని పార్టీల సత్సంబంధాల కోసమేనా…
మల్లారెడ్డి తన రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఇప్పుడు తన కుటుంబాన్ని రాజకీయంగా సుస్థిరం చేసేందుకు కోడలిని ముందు వరుసలో నిలబెట్టారు. అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యేగా ఉండగా ఇప్పుడు కోడలిని ఎంపీగా చూడాలన్నది ఆయన కోరిక. అయితే బీఆర్ఎస్ లో ఉంటే భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న సందిగ్ధంలో ఉన్న మల్లారెడ్డి తన కోడలిని బీజేపీలోకి పంపడం ద్వారా అన్ని పార్టీలతో సత్సంబంధాలు కొనసాగించాలనే వ్యూహంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఇది ఒక రకంగా సేఫ్ గేమ్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మల్కాజిగిరి నియోజకవర్గం తెలంగాణలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానం. ఇక్కడ విద్యావంతులు సెటిలర్లు ఎక్కువగా ఉంటారు. ఈ ఓటర్లను ఆకట్టుకోవాలంటే ప్రీతిరెడ్డి లాంటి కొత్త తరం నాయకురాలు సరైన ఎంపిక అని మల్లారెడ్డి భావిస్తున్నారు. ఆమెకు ఉన్న సాఫ్ట్ ఇమేజ్ బీజేపీకి ఉన్న కేడర్ బలం తోడైతే విజయం సులభం అవుతుందని వారి అంచనా. క్షేత్రస్థాయిలో ప్రజల నాడిని పట్టుకునేందుకు ఆమె ఇప్పటికే గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మహిళా నాయకత్వం తక్కువగా ఉన్న తరుణంలో ప్రీతిరెడ్డి వంటి వారు విజయవంతం అవుతారని భావిస్తున్నారు. ఆమె తన మామ మల్లారెడ్డి లాగా మాస్ గా కాకుండా క్లాస్ గా వ్యవహరిస్తూ యువతను ఆకట్టుకుంటున్నారు. తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేందుకు ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే మల్లారెడ్డి కుటుంబం నుంచి ఒక శక్తివంతమైన మహిళా నాయకురాలు ఉద్భవించే అవకాశం ఉంది. ఈ ప్రయాణం ఎటువైపు దారితీస్తుందో ఎన్నికలు తేల్చనున్నాయి.
