Tuesday, March 10, 2026
HomeతెలంగాణEatala Rajender: ఈటెల యూటర్న్.. మళ్లీ బీఆర్ఎస్ వైపు అడుగులు?

Eatala Rajender: ఈటెల యూటర్న్.. మళ్లీ బీఆర్ఎస్ వైపు అడుగులు?

* కాషాయ పార్టీలో దక్కని గౌరవం

* పార్టీ మారాలని అనుచరుల ఒత్తిడి

* గులాబీ పార్టీ నుంచి ప్రత్యేక ఆహ్వానం?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ: తెలంగాణలో పొలిటికల్ సీన్ మారుతోందా? మాజీమంత్రి ఈటల రాజేందర్ మాతృ పార్టీలోకి వెళ్ళనున్నారా? అలా జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఎంత వాస్తవం? ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో ఇదే అంశం పెద్ద చర్చకు దారి తీస్తోంది. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీని విడిచిపెట్టి గులాబీ పార్టీలో చేరే సాహసం ఆయన చేస్తారా? అనేది కూడా ఒక అనుమానం. కానీ తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఇప్పుడు ఈటెల రాజేందర్ సరికొత్త హాట్ టాపిక్.

ఉద్యమ నేతగా సుపరిచితులు..

తెలంగాణ ఉద్యమ నేతగా ఈటెల రాజేందర్ కు మంచి పేరు ఉంది. గులాబీ పార్టీలో సుదీర్ఘకాలం పని చేసిన రాజేందర్ కెసిఆర్ కు కుడి భుజంగా మెలిగే వారు. అలే నరేంద్ర, విజయశాంతి వంటి వారిని అధిగమించి కెసిఆర్ కు దగ్గర అయ్యారు ఈటెల రాజేందర్. కానీ కెసిఆర్ కుటుంబ సభ్యులు పన్నిన రాజకీయంలో చిక్కి గులాబీ పార్టీకి దూరమయ్యారు. అయితే ఈటెల రాజేందర్ ను దూరం చేసుకుని గులాబీ పార్టీతో పాటు కెసిఆర్ కూడా రాజకీయంగా ఇబ్బంది పడ్డారు. అందుకే ఈటెల రాజేందర్ వస్తే మళ్లీ తిరిగి పార్టీలో చేర్చుకునేందుకు గులాబీ బాస్ సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

మునుపటి గుర్తింపు లేదు..

తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కీలక నేతగా ఉన్నారు ఈటెల రాజేందర్. తెలంగాణ సమాజంలో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అయితే బిజెపిలో చేరిన తరువాత ఎంపీ పదవి వచ్చింది కానీ.. మునుపటి గుర్తింపు లేకుండా పోయింది. కమలం పార్టీలో ఆశించిన స్థాయిలో గుర్తింపు లేకుండా పోయిందన్న ఆవేదన కూడా ఉంది. ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ తో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో, ముఖ్యంగా ఈటల సొంత ఇలాకా హుజురాబాద్ లో ఆయన మాట చెల్లుబాటు కావడం లేదు. బండి సంజయ్ వర్గం జోక్యం పెరగడం, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటెల మద్దతుదారులకు ప్రాధాన్యం తగ్గడం వంటివి మనస్థాపానికి గురి చేసినట్లు తెలుస్తోంది. పైగా బీజేపీ హై కమాండ్ సైతం ఈటలను మల్కాజ్గిరి పార్లమెంటు స్థానానికే పరిమితం చేయడం జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.

అడుగడుగునా ఇబ్బందులు..

వాస్తవానికి బిజెపిలో మంచి గుర్తింపు ఉంటుందని భావించి చేరారు ఈటల రాజేందర్. ఎంపీగా గెలిచిన తనకు క్యాబినెట్ పోస్ట్ ఖాయమని అంచనా వేసుకున్నారు. కానీ చాన్స్ ఇవ్వలేదు బిజెపి హై కమాండ్. పోనీ బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందన్న ప్రయత్నం చేశారు. అది కూడా అందకుండా పోయింది. అమిత్ షా తో పాటు బిజెపి అగ్ర నేతల వద్ద తన బాధను వ్యక్తం చేసుకున్నారు. అయినా ఫలితం లేకపోయింది. గులాబీ పార్టీలో రాష్ట్రస్థాయిలో స్టార్ క్యాంపెయినర్ గా ఉండేవారు. కానీ బిజెపిలో చేరాక ఒక నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులు సముచిత గౌరవం ఉన్న పార్టీలో చేరాలని ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం తెలంగాణ సమాజంలో గులాబీ పార్టీ పుంజుకునేందుకు సర్వశక్తులు వడ్డుతోంది. బిజెపిలో అసంతృప్తితో గడుపుతున్న ఈటెల రాజేందర్ కు వర్తమానం పంపినట్లు సమాచారం. తిరిగి గులాబీ పార్టీలో చేరితే సముచిత స్థానంతో పాటు తగిన గౌరవం ఉంటుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో ఈటెల తన మాతృ పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో దీనిపైనే పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుండగా కొట్టిపారేశారు ఈటెల రాజేందర్. కానీ లోలోపల మాత్రం ఆయన మదన పడుతున్నట్లు పొలిటికల్ వర్గాల్లో నడుస్తోంది ప్రచారం. ఇప్పుడు కాకపోయినా 2028 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందైన ఈటెల రాజేందర్ తన మాతృ పార్టీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. చూడాలి మరి ఇందులో ఎంత వాస్తవం దాగి ఉందో.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments