* నితీష్ కుమార్ యూటర్న్ తో కొత్త ప్రచారం
* అలా అయితే ఏపీకి కొత్త సీఎం ఎవరు?
క్రైమ్ మిర్రర్, అమరావతి: జాతీయ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటివరకు బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్ కేంద్ర మంత్రివర్గంలోకి రానున్నారు. రాజ్యసభకు సంబంధించి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. సీఎం పదవి బిజెపికి విడిచి పెట్టేందుకు ఆయన సుముఖత వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆయన కుమారుడు బీహార్ రాష్ట్రానికి డిప్యూటీ స్పీకర్ గా ఎన్నిక కానున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో సైతం ఇదే తరహా మార్పులు ఉంటాయని ప్రచారం నడుస్తోంది. ఏపీ సీఎం చంద్రబాబు సైతం కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారని సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. కేంద్ర మంత్రివర్గంలోకి చంద్రబాబు చేరడంతో పాటు కీలకమైన ఎన్ డి ఏ కన్వీనర్ పదవిని చేపడుతారని కొత్త ప్రచారం అయితే మొదలైంది. అదే జరిగితే ఏపీ సీఎం గా ఎవరూ బాధ్యతలు తీసుకుంటారన్నది ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది.
గతంలో కీలక భూమిక..
తెలుగుదేశం పార్టీకి కేంద్ర రాజకీయాలు కొత్త కాదు. టిడిపి ఆవిర్భావం తర్వాత ఎన్నో సందర్భాల్లో జాతీయస్థాయిలో ప్రధాన భూమిక పోషించింది. ఎన్టీఆర్ అయితే సంకీర్ణ ప్రభుత్వాల సారథిగా వ్యవహరించారు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా కొనసాగారు. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు సైతం జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సందర్భాలు ఉన్నాయి. 1999లో వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామిగా ఉంది. అప్పుడే చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ గా కూడా వ్యవహరించారు. ఐదు సంవత్సరాల పాటు సంకీర్ణ ప్రభుత్వం కొనసాగడంలో చంద్రబాబు పాత్ర ఉంది. అయితే ఇప్పుడు అదే చంద్రబాబు ఎన్డీఏ కన్వీనర్ గా వ్యవహరిస్తారన్న ప్రచారం నడుస్తోంది.
కొద్ది నెలల కిందట బాధ్యతలు..
బీహార్ ముఖ్యమంత్రిగా కొద్ది నెలల కిందట బాధ్యతలు చేపట్టారు నితీష్ కుమార్. అయితే ఆ ఎన్నికల్లో నితీష్ సీఎం అనే ప్రచారంతో ముందుకు వెళ్ళింది ఎన్డీఏ. అందుకే నితీష్ కుమార్ కు ముఖ్యమంత్రి పదవి విడిచి పెట్టాల్సి వచ్చింది. అయితే బీహార్లో ఒక రాజకీయ పరిణామం జరిగింది. అక్కడ జేడీయు కంటే బిజెపి బలం పెంచుకుంది. అందుకే జెడియు బలం పెరగాలంటే రాజకీయ అధికార మార్పిడి జరగాలన్నది నితీష్ ఆలోచన. తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళితే వారసుడికి రాష్ట్ర రాజకీయాల్లో చోటు కల్పించవచ్చని భావించారు. అందుకే కేంద్రమంత్రి పదవిలోకి వెళ్లేందుకు సిద్ధపడ్డారు.
బీహార్ కంటే భిన్నం..
అయితే బీహార్ రాజకీయాలకు ఏపీ పాలిటిక్స్ భిన్నం. నితీష్ మాదిరిగా చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే ఛాన్స్ లేదని తేలిపోయింది. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిందే కానీ.. చంద్రబాబు జాతీయ రాజకీయాలకు సంబంధించి ఎటువంటి పదవి చేపట్టలేదు. ప్రస్తుతం ఏపీకి చంద్రబాబు అవసరం కూడా ఉంది. అమరావతి రాజధాని నిర్మాణంతో పాటు నవ్యాంధ్రప్రదేశ్ కు సంబంధించి అభివృద్ధి జరుగుతోంది. ఇటువంటి సమయంలో చంద్రబాబు అంతటి సాహసానికి దిగడానికి కూడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ ప్రచారంలో ఎంత మాత్రం నిజం లేదని కూడా పొలిటికల్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నితీష్ ఇప్పటికే పలుమార్లు కేంద్రమంత్రిగా వ్యవహరించడంతో పార్టీ మనుగడ కోసం.. కుమారుడు రాజకీయ భవిష్యత్తు కోసం ఈ నిర్ణయానికి వచ్చారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా చంద్రబాబు సీఎం పదవి విడిచి పెడితే పవన్ కళ్యాణ్, లోకేష్ మధ్య పోటీ ఏర్పడడం ఖాయం. అందుకే ఆ పరిస్థితి చంద్రబాబు రానివ్వరని.. జాతీయ రాజకీయాల్లోకి ఆయన వెళ్ళరని ఎక్కువ మంది అభిప్రాయపడుతున్నారు. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
