అన్నాచెల్లెళ్ల మధ్య విజయమ్మ రాజీ
క్రైమ్ మిర్రర్, కడప ప్రతినిధి : వైయస్ కుటుంబం ఒకటి కానుందా? సోదరుడు జగన్మోహన్ రెడ్డితో షర్మిల రాజీ పడ్డారా? అలా చేసింది వైయస్ విజయమ్మా? చక్కని రాజీ ఫార్ములాను తెరపైకి తెచ్చారా? అందుకు జగన్ సైతం సిద్ధపడ్డారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఒక ఆసక్తికర చర్చ నడుస్తోంది. త్వరలో వైయస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వైసీపీలో చేరబోతున్నట్లు తెగ ప్రచారం నడుస్తోంది. సోషల్ మీడియాలో సైతం ఇదే హార్ట్ టాపిక్ అవుతోంది. షర్మిల అనుకున్నది, ఆమె కోరుకున్నది కుమారుడు రాజారెడ్డికి ఇచ్చేందుకు జగన్ సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అన్నీ కుదిరితే త్వరలో షర్మిల కుమారుడు రాజారెడ్డి వైసీపీలో చేరడం ఖాయమని తెలుస్తోంది. గత కొంతకాలంగా జగన్, షర్మిలల మధ్య ఉప్పు నిప్పుల పరిస్థితి ఉంది. అయితే కుటుంబ సన్నిహితుల కోరిక మేరకు వారిద్దరినీ కలిపేందుకు విజయమ్మ రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి.
ఎంతో అన్యోన్యత..
రాజశేఖర్ రెడ్డి బతికున్నంత కాలం ఆయన పిల్లలు ఇద్దరు అన్యోన్యంగా ఉండేవారు. ఆయన అకాల మరణం సమయంలో సైతం సోదరుడు జగన్మోహన్ రెడ్డికి షర్మిల ఎంతగానో అండగా నిలిచారు. కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలబడ్డారు షర్మిల. 16 నెలల పాటు జగన్ జైలుకు వెళ్ళిపోతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని కాపాడగలిగారు. తల్లి విజయమ్మతో కలిపి పార్టీకి అండగా నిలిచారు. అటువంటి షర్మిల వ్యక్తిగత, కుటుంబ విభేదాలతో జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యారు. రాజకీయ బద్ధ శత్రువుగా మారిపోయారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పతనానికి ఒక కారణం అయ్యారు.
డిఫెన్స్ లో విజయమ్మ..
అయితే పిల్లలిద్దరి విషయంలో పూర్తి డిఫెన్స్ లో పడ్డారు విజయమ్మ. భర్త రాజశేఖర్ రెడ్డి మరణంతో రాజకీయాల్లోకి వచ్చారు. కుమారుడు పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2014 ఎన్నికల్లో పోటీ కూడా చేశారు. అయితే తొలి ఎన్నికల్లో వైసీపీకి ఓటమి ఎదురు కావడంతో కుమార్తె షర్మిలతో కలిసి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు కష్టపడ్డారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలకు ఎటువంటి ప్రాధాన్యం దక్కలేదు. రాజకీయంగా పదవి ఇవ్వలేదు. ఆర్థిక వారసత్వంగా వచ్చిన ఆస్తిని ఇవ్వలేదు. ఈ క్రమంలో తన తండ్రి పేరిట తెలంగాణలో సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు షర్మిల. అక్కడ వర్క్ అవుట్ కాకపోయేసరికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా పదవి చేపట్టారు. తన అన్న పై ఉన్న కోపంతో పూర్తి శత్రువుగా మారిపోయారు. అలా జగన్ అధికారం నుంచి దూరమయ్యారు. ఈ క్రమంలో విజయం సైతం కుమారుడికి కాస్త దూరం జరిగి కుమార్తె షర్మిలకు అండగా నిలబడ్డారు. 2024 ఎన్నికల్లో జగన్ దారుణంగా ఓడిపోయేసరికి.. ఆ కుటుంబాల మధ్య గ్యాప్ మరింత తీవ్రం అయ్యింది.
కుటుంబ అభిమానుల సూచన మేరకు..
అయితే కాలక్రమంలో రాజశేఖర్ రెడ్డి కి ఉన్న రాజకీయ ప్రాశస్త్యం తగ్గిపోవడాన్ని సహించుకోలేకపోయారు కుటుంబ అభిమానులు. అందుకే పిల్లలు ఇద్దరినీ కలపాలని సూచించారట. కలిసి నడవకపోతే రాజకీయంగా చిక్కులు ఎదురవుతాయని ఒక అంచనాకు వచ్చారట. అందుకే జగన్మోహన్ రెడ్డి వద్ద ఒక రాజీ ఫార్ములా పెట్టారట. వచ్చే ఎన్నికల్లో షర్మిల కుమారుడు రాజారెడ్డికి కడప ఎంపీ సీటు ఇస్తే సమస్యలు అన్ని సమసిపోతాయని సూచించారట. వివేకానంద రెడ్డి హత్య కేసు నేపథ్యంలో ఎంపీ అవినాష్ రెడ్డి పై ఒక ముద్ర ఉంది. ఇటువంటి తరుణంలో ఎంపీ అభ్యర్థిగా షర్మిల కుమారుడు అయితే అన్ని సమస్యలు కొలిక్కి వస్తాయని తల్లి విజయమ్మ సూచించేసరికి జగన్ మెత్తబడ్డారట. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే షర్మిల కుమారుడు రాజారెడ్డి వైసీపీ ఎంట్రీ ఎంతో దూరంలో లేనట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?
