Homeతెలంగాణప్రకృతి ఒడిలో హోళీ.. రసాయన రంగులకు స్వస్తి పలుకుదాం

ప్రకృతి ఒడిలో హోళీ.. రసాయన రంగులకు స్వస్తి పలుకుదాం

•ఆకతాయిలపై ఉక్కుపాదం.. మహిళల భద్రతకు షీ టీమ్స్ పహారా

​•నీటి ప్రమాదాల పట్ల అప్రమత్తత..తల్లిదండ్రులకు ఎస్పీ పవార్ విజ్ఞప్తి

నల్లగొండ,క్రైమ్ మిర్రర్:-హోళీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ శుభాకాంక్షలు తెలిపుతూ, హోలీ పండుగను సాంప్రదాయబద్ధంగా, పరస్పర గౌరవంతో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, నిర్వహించుకోవాలని జిల్లా ప్రజలను కోరారు.
హోళీ వేడుకల సందర్భంగా.. సహజసిద్ధమైన రంగులను మాత్రమే ఉపయోగించాలని, హానికరమైన రసాయనిక రంగులను వాడకూడదని ఆయన సూచించారు. ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలు చేయరాదని హెచ్చరించారు. ప్రార్థనా మందిరాలు, ప్రజా ప్రదేశాలు, రహదారులపై, వాహనదారులకు ఆటంకం కలిగించే విధంగా ప్రవర్తించవద్దని తెలిపారు.

మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని, ఎవరైనా ఆకతాయిలు వేధింపులకు పాల్పడితే, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం జిల్లాలో షీ టీమ్ బృందాలను ప్రత్యేకంగా మోహరింపజేసి, ప్రధాన కూడళ్లలో, జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.పండుగ సందర్భంగా మద్యం సేవించి వాహనాలు నడపరాదని, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు విస్తృతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. యువత వాహనాలను అతివేగంగా నడపకుండా జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.

ఈత రాని వారు చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్లకూడదని, చిన్నపిల్లలను అటువంటి ప్రదేశాలకు తీసుకెళ్లరాదని విజ్ఞప్తి చేశారు. లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పండుగ వేళ ఎవరైనా గొడవలు సృష్టించినా, అసత్య ప్రచారం చేసినా, సామాజిక మాధ్యమాల ద్వారా అపోహలు వ్యాప్తి చేసినా, కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.జిల్లా ప్రజలందరూ కలిసిమెలిసి, పరస్పర గౌరవంతో, సురక్షితంగా సహజ సిద్దమైన హోళీ పండుగను జరుపుకొని, పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు