* త్వరలో బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు
* కొత్త పుంతలు తొక్కుతున్న ప్రధాన పార్టీల ప్రచారాలు
* సోషల్ మీడియా వేదికగా క్యాంపెయిన్
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న పశ్చిమ బెంగాల్‌లో పార్టీలు తమ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. ప్రధాన పార్టీలు అన్నీ సోషల్ మీడియా బాట పట్టాయి. పార్టీల ప్రచారానికి ఇన్‌ఫ్లూయెన్సర్లను వాడుకోవాలని అధికార టీఎంసీ, విపక్ష బీజేపీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో సామాజిక మాధ్యమ ఇన్‌ఫ్లూయెన్సర్లకు మంచి డిమాండ్ ఏర్పడింది. అన్ని పార్టీల వారు తమకు అనుకూలంగా రీల్స్ చేయమంటూ వారిని కోరుతున్నారు. ఒక్కో రీల్‌కు రూ. 25 వేల నుంచి 80 వేల వరకు చెల్లిస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. దీని కోసం ఆరు నెలల ముందు నుంచే ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే గత ఏడాది నవంబర్‌లో కోల్‌కతాలో బీజేపీ ఒక హోటల్‌లో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమానికి 60 మంది ఇన్‌ఫ్లూయెన్సర్లు హాజరయ్యారు.
ఫాలోవర్లను బట్టి పేమెంట్
ఇన్‌ఫ్లూయెన్సర్లను నానో, మైక్రో, మెగా క్యాటగిరీలుగా విభజించి వారి ఫాలోవర్ల సంఖ్యను బట్టి పేమెంట్‌ను నిర్ణయిస్తున్నారు. 10 వేల లోపు ఫాలోవర్లు ఉన్న వారు నానో, 10,000 నుంచి లక్ష ఫాలోవర్లు ఉన్న వారు మైక్రో, 10 లక్షల కన్నా ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న వారిని మెగా ఇన్‌ఫ్లూయెన్సర్ల క్యాటగిరీలో చేర్చారు. అయితే తాము ప్రచారం కోసం ఏ ఇన్‌ఫ్లూయెన్సర్‌ను సంప్రదించలేదని అటు బీజేపీ, ఇటు టీఎంసీ ఖండించాయి. సోషల్ మీడియా ప్రచారానికి తమ వద్ద నిధులే లేవంటూ కాంగ్రెస్ చేతులెత్తేసింది. కాగా, పార్టీలకు ప్రచారం చేయడంపై ఈ ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని, ఎన్నికల సమయంలోనే పార్టీలకు ప్రచారం చేసి నాలుగు రాళ్లు వెనకేసుకోవాలని కొందరు పేర్కొంటుండగా, ఇది నైతికతతో కూడి వ్యవహారమని ఇంకొకరు అంటున్నారు.
