Thursday, February 26, 2026
HomeజాతీయంSocial Connections: సోషల్ బాండింగ్‌తో జీవిత కాలం పెంచే రహస్యం!

Social Connections: సోషల్ బాండింగ్‌తో జీవిత కాలం పెంచే రహస్యం!

Social Connections: ఎక్కువ రోజులు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించాలంటే కేవలం పోషకాహారం తీసుకోవడం, నిత్యవ్యాయామం చేయడం మాత్రమే సరిపోదని నిపుణులు చెబుతున్నారు. జీవితకాలాన్ని ప్రభావితం చేసే అంశాల్లో స్ట్రాంగ్ సోషల్ కనెక్షన్స్/ బాండింగ్ కూడా కీలక పాత్ర పోషిస్తాయని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి. మనుషుల మధ్య ఏర్పడే స్నేహబంధాలు, కుటుంబ అనుబంధాలు, పరస్పర విశ్వాసం వంటి అంశాలు శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతకు కూడా బలమైన ఆధారంగా నిలుస్తాయని వెల్లడైంది. మధ్య వయస్సు వారిపై అమెరికాలో నిర్వహించిన దీర్ఘకాలిక అధ్యయనాల ఆధారంగా చేసిన విశ్లేషణల్లో, నిరంతర సామాజిక అనుబంధాలు సెల్యులార్ స్థాయిలో కూడా మనుషుల ఆయుష్షును పెంచడంలో సహకరిస్తాయని తేలింది. ఈ సంబంధాలు జీవకణాల క్రియాశీలతను ప్రభావితం చేసి, వృద్ధాప్య ప్రక్రియను మందగింపజేస్తాయని పరిశోధకులు పేర్కొన్నారు.

కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు, పరిచయస్తులు, ఇరుగు పొరుగువారు వంటి వర్గాల మధ్య ఏర్పడే స్వచ్ఛమైన, నిష్కపటమైన బంధాలు మనుషుల జీవగడియారంపై సానుకూల ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. 2,000 మందికిపైగా పెద్దలను పరిశీలించిన పరిశోధనలో, సత్సంబంధాలు కలిగిన వ్యక్తుల్లో జీవకణాల స్థాయిలో వృద్ధాప్య వేగం తగ్గినట్లు నిర్ధారణకు వచ్చారు. పరస్పర సహకారం, భావోద్వేగ మద్దతు, ఆనందభావం, నమ్మకం వంటి అంశాలు ఒత్తిడిని తగ్గించడమే కాకుండా శరీరంలో జరిగే జీవరసాయన మార్పులను సమతుల్యం చేయడంలో సహాయపడుతున్నాయని తెలిపారు. కణాల వయస్సును కొలిచే అణు స్థాయి సూచికల ఆధారంగా చేసిన విశ్లేషణల్లో, బలమైన సామాజిక బంధాలు జీవవృద్ధాప్యాన్ని ఆలస్యం చేస్తున్నట్లు వెల్లడైంది.

పరిశోధకుల వివరాల ప్రకారం.. ప్రేమతో, పరస్పర గౌరవంతో కొనసాగించే దీర్ఘకాలిక బంధాలు శరీరంలోని దహన ప్రక్రియలను నియంత్రించగలవని తేలింది. ముఖ్యంగా దీర్ఘకాలిక ఇన్‌ఫ్లమేషన్ అనేది వృద్ధాప్య సంబంధిత వ్యాధులకు ప్రధాన కారణంగా భావించబడుతోంది. అయితే డీప్, లైఫ్‌లాంగ్ సోషల్ బాండ్స్ ఉన్నవారిలో ఈ సూచికలు తక్కువగా నమోదయ్యాయని గుర్తించారు. ఆసక్తికర విషయం ఏమిటంటే.. ఇది రోజువారీ ఒత్తిడి నిర్వహణతో నేరుగా సంబంధం లేదని పరిశోధకులు పేర్కొన్నారు. ఒత్తిడి సూచికలతో గణనీయమైన సంబంధం కనిపించకపోయినా, కుటుంబ ప్రేమ, స్నేహితుల మద్దతు, సమాజంతో సత్సంబంధాలు, పరస్పర నమ్మకం వంటి అంశాలు దీర్ఘకాల ప్రయోజనాలను అందిస్తున్నాయని తెలిపారు.

అయితే ఈ ఫలితాలు ప్రతి వ్యక్తికి ఒకే విధంగా వర్తిస్తాయని చెప్పలేమని కూడా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. వ్యక్తిగత జీవనశైలి, ఆహారపు అలవాట్లు, వారసత్వ లక్షణాలు, పరిసర పరిస్థితులు వంటి అంశాలు కూడా ఆయుష్షుపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. అయినప్పటికీ బలమైన సామాజిక అనుబంధాలు దీర్ఘాయుష్షు సాధనలో ముఖ్యమైన భాగమని పరిశోధనలు సూచిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవితం కోసం శారీరక సాధనలతో పాటు భావోద్వేగ బంధాలను కూడా పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

ALSO READ: Heroine Meera Chopra: డ్రైవర్ ప్రవర్తనతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్న

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments