HomeజాతీయంDevji Surrender: మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ, దేవ్ జీ లొంగుబాటు!

Devji Surrender: మావోయిస్టు పార్టీకి గట్టి ఎదురుదెబ్బ, దేవ్ జీ లొంగుబాటు!

  • మల్లా రాజిరెడ్డి సహా 25 మంది కూడా లొంగుబాటు
  • ప్రకటించిన ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం
  • సీఎం రేవంత్‌ సమక్షంలో లొంగుబాటును చూపే అవకాశం

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌ జీ, కేంద్ర కమిటీ సభ్యుడు మల్లా రాజిరెడ్డి అలియాస్‌ సంగ్రామ్‌ తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. రాష్ట్ర కమిటీ సభ్యుడైన నర్సింహారెడ్డితో పాటు మొత్తం 25 మంది ప్రత్యేక ఇంటెలిజెన్స్‌ బ్యూరో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఈ లొంగుబాటును రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి నిర్ధారించారు. దేవ్‌జీతో పాటు మరికొందరు మావోయిస్టులు తెలంగాణ పోలీసులకు లొంగిపోయారని ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం కూడా చెప్పారు. మావోయిస్టు పార్టీకి చెందిన కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో తెలంగాణ వ్యక్తులు 15 మంది ఉన్నారని.. వారంతా లొంగిపోవాలని ఇటీవల రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి సూచించారు.

తెలంగాణలో లొంగిపోతున్న మావోయిస్టులు

వాస్తవానికి మల్లోజుల లొంగుబాటు తర్వాత వరసగా వివిధ స్థాయుల్లో ఉన్న మావోయిస్టు క్యాడర్‌ లొంగుబాటుకు తెలంగాణను వేదికగా చేసుకున్నారు. ఇదే క్రమంలో గత కొన్నాళ్లుగా కరీంనగర్‌కు చెందిన తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ, రాజిరెడ్డిల లొంగుబాటుకు సానుకూల వాతావరణం కల్పించాలని ప్రజాసంఘాల నేతలు, మేధావులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇటీవల ఆపరేషన్‌ కర్రెగుట్టల పేరిట వేలాది సాయుధ బలగాలను రంగంలో దింపి కేంద్రం మరోసారి మావోయిస్టుల మీద తీవ్ర ఒత్తిడి తెచ్చింది. దీంతో ప్రాణహాని లేకుండా చూస్తే లొంగిపోవడానికి సిద్ధంగా ఉన్నామనే సంకేతాలు దేవ్‌జీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.

విదేశాలకు అగ్రనేత గణపతి

హిడ్మా ఎన్‌కౌంటర్‌ తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో పట్టుబడిన మావోయిస్టుల్లో దేవ్‌జీ అంగరక్షకులు నలుగురు ఉండడం అనుమానాలకు తావిచ్చింది. ఆయన కదలికల సమాచారం నిఘా వర్గాలకు ఎప్పటికప్పుడు అందుతుందనే అనుమానాలు దీంతో బలపడ్డాయి. కాగా, మావోయిస్టుల లొంగుబాటును సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో చూపాలని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అటు మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి ఆచూకీ ఇంకా లభించలేదు. ఆయన విదేశాలకు వెళ్లిపోయారనే ప్రచారం జరుగుతోంది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

తాజావార్తలు