Wednesday, March 25, 2026
HomeజాతీయంUnder-19 World Cup 2026: సూర్యవంశీ సూపర్ సెంచరీ.. అండర్-19 వరల్డ్ కప్ విజేతగా...

Under-19 World Cup 2026: సూర్యవంశీ సూపర్ సెంచరీ.. అండర్-19 వరల్డ్ కప్ విజేతగా భారత్!

India Wins ICC Under-19 World Cup 2026: అండర్‌-19 ప్రపంచకప్‌లో భారత్‌ టైటిల్‌ విజేతగా నిలిచింది. టైటిల్‌ ఫెవరేట్‌ హోదాకు తగ్గట్లు మెగాటోర్నీలో అపజయమెరుగని యువ భారత్‌ ఆరోసారి వరల్డ్‌ కప్‌ను తమ సొంతం చేసుకుంది. హరారే వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పరుగుల వరద పారించి.. ఇంగ్లండ్‌పై 100 పరుగుల తేడాతో భారత్ చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. మెగాటోర్నీలో ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ ముందుకు సాగిన ఆయూశ్‌ మాత్రె సారథ్యంలోని యువ భారత్‌.. విజయదుందుభి మోగించింది.

సూర్యవంశీ సూపర్ సెంచరీ

ఫైనల్ మ్యాచ్ లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్‌ వైభవ్‌ సూర్యవంశీ (80 బంతుల్లో 175, 15ఫోర్లు, 15సిక్స్‌ లు) ధనాధన్‌ సెంచరీకి తోడు కెప్టెన్‌ ఆయూశ్‌ మాత్రె(53), అభిజ్ఞాన్‌ కుందు(40) రాణించడంతో భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 411/9 స్కోరు చేసింది. హైదరాబాదీ బ్యాటర్‌ ఆరోన్‌ జార్జ్‌ (9)నిరాశపరిచినా.. సూర్యవంశీ తన సహజసిద్ధమైన శైలిలో బౌండరీలతో విరుచుకుపడ్డాడు. ఇంగ్లండ్‌ బౌలర్లను ఉతికి ఆరేశాడు. పిచ్‌పై బంతి పడటం ఆలస్యం..తన ట్రేడ్‌మార్క్‌ షాట్లతో అలవోకగా ఫోర్లు, సిక్స్‌లు కొట్టడంతో ఇంగ్లండ్‌ బౌలర్లు చేష్టలుడిగిపోయారు. సూర్యవంశీ బాదుడుకు టీమ్‌ఇండియా 500 మార్క్‌ అందుకుంటుదనుకున్న అభిమానులకు అతని నిష్క్రమణతో నిరాశే ఎదురైంది. జేమ్స్‌ మింటో(3/63), అలెక్స్‌ గ్రీన్‌(2/49) ఆకట్టుకున్నారు.

311 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్

ఇక లక్ష్యఛేదనలో ఇంగ్లండ్‌ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌటైంది. కాలెబ్‌ ఫాల్క్‌నర్‌(115) సెంచరీతో ఒంటరిపోరాటం చేసినా లాభం లేకపోగా, బెన్‌ డాకిన్స్‌(66) రాణించాడు. అంబరీశ్‌(3/56) మూడు వికెట్లు తీయగా, దీపేశ్‌(2/64), కనిశ్క్‌(2/63) రెండేసి వికెట్లు దక్కించుకున్నారు. అద్భుత ప్రదర్శనతో భారత ప్రపంచకప్‌ విజయంలో కీలకంగా వ్యవహరించిన వైభవ్‌ సూర్యవంశీకి ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’తో పాటు సిరీస్‌ దక్కింది.

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments