మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలో విద్యార్థుల పట్ల సిబ్బంది వ్యవహరించిన తీరు తీవ్ర వివాదానికి దారితీసింది. చదువులో ఆశించిన స్థాయిలో రాణించడం లేదనే కారణంతో ఏకంగా 82 మంది విద్యార్థులకు సగం గుండు కొట్టించిన ఘటన కిన్వట్ ప్రాంతంలోని ఓ ఆశ్రమ పాఠశాలలో చోటుచేసుకుంది.
సోమవారం జరిగిన ఈ ఘటనతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పాఠశాల నుంచి ఇంటికి చేరుకున్న తర్వాత తమకు ఎదురైన పరిస్థితిని తల్లిదండ్రులకు వివరించడంతో విషయం బయటకు వచ్చింది. తమ పిల్లలకు ఇలా సగం గుండు కొట్టించడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
విద్యార్థులను చదువులో మెరుగుపరచేందుకు సూచనలు, కౌన్సెలింగ్ వంటి మార్గాలను అనుసరించాల్సిన సిబ్బంది.. శారీరకంగా, మానసికంగా ఇబ్బందికి గురిచేసే విధంగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు తీవ్రంగా స్పందించారు. విద్యార్థులకు సగం గుండు చేయించిన పరిస్థితులు, అందుకు బాధ్యులైన సిబ్బంది ఎవరు అనే అంశాలపై సమగ్ర విచారణకు ఆదేశించారు. విచారణలో వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత బాధ్యులపై తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.
విద్యార్థుల గౌరవం, మానసిక భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించబోమని అధికారులు స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోంది.
also read: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి…!
