-
వైసీపీ మద్దతు స్టాలిన్ కు..
-
డీఎంకేకు అనుకూలంగా ఎలక్షన్ క్యాంపెయిన్
-
ఇప్పుడు టీవీకే గెలుపుతో మడత పేచి
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: తమిళనాడులో విజయ్ గెలిచారు. కానీ ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. జగన్మోహన్ రెడ్డి మద్దతుతోనే తమిళనాడులో విజయ్ విజయం సాధించారు అన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అభిప్రాయం. దీనికి గట్టిగానే కౌంటర్ ఇస్తున్నాయి కూటమి పార్టీలు. సొంత రాష్ట్రంలో గెలవలేరు కానీ.. పక్క రాష్ట్రంలో ప్రభావం చూపుతున్నారట.. అంటూ ఎద్దేవా చేస్తోంది. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇవేవీ పట్టించుకోవడం లేదు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో విజయ్ జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపారు అంటూ గొప్పగా ప్రచారం చేసుకుంటోంది.
క్రెడిట్ చోరీకి ఆరాటం..
ఇప్పటివరకు ఏపీలో ఎటువంటి అభివృద్ధి జరిగినా.. కొత్త ప్రాజెక్టు వచ్చినా అది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గొప్పతనంగా చెప్పుకుంటూ వచ్చింది ఆ పార్టీ. క్రెడిట్ కోసం చాలా రకాలుగా ఆరాటపడింది. చాలా సందర్భాల్లో కూడా చూసాం. కానీ ఇప్పుడు పక్క రాష్ట్రంలో విజయ్ గెలుపును కూడా తన ఖాతాలో వేయాలనుకోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ప్రారంభం అయింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గతంలో స్టాలిన్‌తో సన్నిహితంగా ఉండేవారు. అన్నింటికీ మించి స్టాలిన్ కు మద్దతుగా వైసిపి మాజీమంత్రి రోజా ప్రచారం చేశారు. ఒకవైపు డీఎంకేకు మద్దతుగా ప్రచారం చేసి.. ఇంకోవైపు టీవీకే పార్టీ గెలుపు వెనక జగన్ ఉన్నారని చెప్పడం ఏమిటనేది ఇప్పుడు వైసీపీకి ఎదురవుతున్న ప్రశ్న. కానీ ఇవేవీ పట్టించుకోకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అదే పనిగా ప్రచారం చేస్తోంది.
స్టాలిన్ తో సంబంధాలు
తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ తో జగన్మోహన్ రెడ్డికి మంచి సంబంధాలే ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి స్టాలిన్ వచ్చారు. స్టాలిన్ ప్రమాణ స్వీకారానికి తన ప్రతినిధులను పంపారు జగన్. తాజాగా ఎన్నికల ప్రచారంలో రోజా పాల్గొన్నారు. ఏపీలో జగన్మోహన్ రెడ్డి మాదిరిగానే తమిళనాడులో స్టాలిన్ పాలన సాగించారని చెప్పుకున్నారు. అయితే స్టాలిన్ పార్టీ ఓడిపోవడంతో మడత పేచి వేస్తూ మాట్లాడుతున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు. విజయ్ గెలుపు వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటూ కొత్త ప్రచారం చేస్తున్నారు.
రంగంలోకి పెద్దిరెడ్డి..
అయితే చెన్నైలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా డీఎంకే మద్దతుగా నిర్వహించినట్లు ఒక ప్రచారం ఉంది. దీనికి సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సారథ్యం వహించినట్లు కూడా టాక్ నడుస్తోంది. అక్కడ రెడ్డి సామాజిక వర్గాల ప్రతినిధులతో, అక్కడే స్థిరపడిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పెద్దిరెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకేకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఒకవైపు స్టాలిన్ తో జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు, ఇంకోవైపు బాహటంగానే మాజీ మంత్రి రోజా ప్రచారం, మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ ఇలా అన్ని డీఎంకేకు అనుకూలంగా చేశాయి వైసీపీ శ్రేణులు. కానీ ఒక ఫోటో పెట్టి ఇప్పుడు విజయ్ మావాడే అంటూ భుజాలు తడుముకోవడం మాత్రం విమర్శలకు తావిస్తోంది.