క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. నేరెడ్‌మెట్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై స్నేహితులతో కలిసి రీల్స్ చేసేందుకు వెళ్లిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు ఎంఎంటీఎస్ రైలు ఢీకొనడంతో మృతి చెందాడు. మంగళవారం సాయంత్రం చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఒడిశాకు చెందిన సుబాస్ మాలిక్ (30) ఉపాధి కోసం హైదరాబాద్‌కు వచ్చి సఫిల్‌గూడలోని ఓ హోటల్‌లో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు. మంగళవారం సాయంత్రం సుమారు 6.30 గంటల సమయంలో తన స్నేహితులతో కలిసి నేరెడ్‌మెట్ పరిసరాల్లోని రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లినట్లు తెలుస్తోంది.
స్నేహితులతో కలిసి రీల్స్ చిత్రీకరిస్తున్న సమయంలో అదే మార్గంలో ఎంఎంటీఎస్ రైలు రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. రైలు సుబాస్ మాలిక్‌ను ఢీకొనడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు. ఘటనను గమనించిన స్థానికులు, స్నేహితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీస్ ఎస్‌ఐ ఎస్.వి. సుబ్బారెడ్డి సిబ్బందితో కలిసి వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించే ప్రక్రియను చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించడంతో పాటు, రైల్వే ట్రాక్ వద్దకు యువకులు ఎలా వెళ్లారు, ఘటనకు ముందు ఏం జరిగిందనే అంశాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. రైల్వే ట్రాక్‌లపై అనుమతిలేకుండా సంచరించడం అత్యంత ప్రమాదకరమని, రైళ్లు సమీపిస్తున్న విషయాన్ని గుర్తించడం కూడా కష్టంగా ఉంటుందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఫొటోలు, రీల్స్ కోసం రైల్వే ట్రాక్‌లపైకి వెళ్లడం ప్రాణాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని సూచిస్తున్నారు.
also read : నిర్మాణంలో ఉన్న అపార్ట్‌మెంట్ నుంచి పడి కార్మికుడు మృతి
