సోషల్ మీడియా వినియోగదారులకు త్వరలోనే పెద్ద ఊరట లభించనుంది. ఇప్పటి వరకు ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్రముఖ సోషల్ మీడియా వేదికల్లో కొత్తగా లాగిన్ కావాలంటే లేదా అకౌంట్‌ను మళ్లీ యాక్సెస్ చేయాలంటే తప్పనిసరిగా మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని నమోదు చేయాల్సి వచ్చేది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ విధానం అమల్లో ఉండగా, కొన్నిసార్లు ఓటీపీలు ఆలస్యంగా రావడం, నెట్‌వర్క్ సమస్యల కారణంగా అందకపోవడం వంటి ఇబ్బందులు వినియోగదారులను తీవ్రంగా ఇబ్బంది పెట్టేవి. ముఖ్యంగా సిగ్నల్ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో లాగిన్ ప్రక్రియ పూర్తి కావడానికి ఎక్కువ సమయం పట్టేది. అయితే ఇప్పుడు ఈ సమస్యలకు పరిష్కారంగా వొడాఫోన్ ఐడియా తన వినియోగదారుల కోసం అత్యాధునిక సాంకేతికతను అందుబాటులోకి తీసుకువచ్చింది.
మెటాతో భాగస్వామ్యం కుదుర్చుకున్న వొడాఫోన్ ఐడియా, ఓటీపీ అవసరం లేకుండానే లాగిన్ అయ్యే ప్రత్యేక సదుపాయాన్ని ప్రకటించింది. దీనికి సైలెంట్ మొబైల్ వెరిఫికేషన్ అనే సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఈ విధానం ద్వారా వినియోగదారుడు వొడాఫోన్ ఐడియా మొబైల్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తున్న సమయంలో వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సేవల్లోకి ప్రవేశించేటప్పుడు మొబైల్ నంబర్ ఆధారంగా బ్యాక్‌గ్రౌండ్‌లోనే ధృవీకరణ పూర్తవుతుంది. ఫలితంగా ఓటీపీ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. లాగిన్ ప్రక్రియ మరింత వేగంగా, సులభంగా పూర్తవుతుంది. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ సదుపాయాన్ని ప్రవేశపెడుతున్నట్లు సంస్థ వెల్లడించింది.
సైలెంట్ మొబైల్ వెరిఫికేషన్ అనేది నెట్‌వర్క్ ఆధారిత భద్రతా ధృవీకరణ సాంకేతికత. ఇందులో వినియోగదారుడి మొబైల్ నంబర్‌ను నేరుగా టెలికాం నెట్‌వర్క్ ద్వారానే ధృవీకరిస్తారు. అందువల్ల ధృవీకరణ కోసం ప్రత్యేకంగా సందేశం రావడం, కోడ్ నమోదు చేయడం లేదా ఒక యాప్ నుంచి మరొక యాప్‌కు మారడం వంటి ప్రక్రియలు అవసరం ఉండవు. మొత్తం ప్రక్రియ వినియోగదారుడికి కనిపించకుండా నేపథ్యంలోనే పూర్తవుతుంది. కొత్త సిమ్ యాక్టివేషన్ సమయంలో, మొబైల్ నంబర్ ధృవీకరణలో, అకౌంట్‌లోకి లాగిన్ లేదా రీ-లాగిన్ అయినప్పుడు, అకౌంట్ పునరుద్ధరణ సమయంలో కూడా ఈ సాంకేతికత ఉపయోగపడుతుంది.
మెటాతో కలిసి ఈ తరహా సదుపాయాన్ని తీసుకువచ్చిన తొలి టెలికాం సంస్థగా వొడాఫోన్ ఐడియా నిలిచింది. ఈ ఫీచర్ విజయవంతమైతే భవిష్యత్తులో ఇతర టెలికాం సంస్థలు కూడా ఇదే తరహా సాంకేతికతను ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ఓటీపీ కోసం వేచి ఉండే రోజులు క్రమంగా ముగిసే అవకాశం ఉంది. ముఖ్యంగా నెట్‌వర్క్ సమస్యలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఉన్న వినియోగదారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారనుంది. వేగవంతమైన, సురక్షితమైన, ఇబ్బందులు లేని లాగిన్ అనుభవాన్ని అందించడంలో ఈ కొత్త విధానం కీలక పాత్ర పోషించనుందని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: వర్షాలకు గోడలు తడుస్తున్నాయా?.. లైట్ తీసుకుంటే డేంజర్ తప్పదు