– కడప, కర్నూలు, తిరుపతి తమ వేనంటున్న ఫ్యాన్ పార్టీ నాయకులు
– రాయలసీమలో మెజారిటీ మున్సిపాలిటీలను సైతం కైవసం చేసుకుంటామని ధీమా
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల కు సంబంధించి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్షణంలోనైనా షెడ్యూల్ ప్రకటించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధంగా ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో 100కు పైగా మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లకు రిజర్వేషన్లను ప్రకటించారు. అయితే ఈసారి మేయర్ తో పాటు మున్సిపల్ చైర్మన్ కు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఏకపక్షంగా గెలుచుకుంటామని కూటమి చెబుతుండగా.. తాము సైతం సత్తా చాటుతామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తేల్చి చెబుతోంది. స్థానిక ఎన్నికల్లో గెలుపుతో 2024 అసెంబ్లీ ఎన్నికల ఓటమిని అధిగమించాలని భావిస్తోంది. అంతర్గతంగా పెద్ద కసరత్తు చేస్తోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా గెలుపు అవకాశాలను విశ్లేషిస్తూ కార్యకర్తల నుంచి వివరాలు సేకరిస్తోంది.
కూటమి కంటే మెరుగ్గా..
రాష్ట్ర వ్యాప్తంగా 17 మున్సిపల్ కార్పొరేషన్ లు ఉన్నాయి. రాయలసీమకు సంబంధించి మూడు కార్పొరేషన్లను కైవసం చేసుకుంటామని వైసిపి ధీమా వ్యక్తం చేస్తోంది. దాదాపు ప్రతి చోట గట్టి పోటీ ఇస్తామని.. రాయలసీమలోని ఆ మూడు కార్పొరేషన్లను మాత్రం కూటమి కంటే మెరుగ్గా ఉన్నామని వైసిపి నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా రాయలసీమలో మెజారిటీ మున్సిపాలిటీలను తామే కైవసం చేసుకుంటామని చెప్పుకొస్తున్నారు. రాయలసీమలో ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గ్రాఫ్ తగ్గలేదని చెబుతుండడం విశేషం. ప్రధానంగా కడప నగరపాలక సంస్థతో పాటు కర్నూలు, తిరుపతి కార్పొరేషన్లను సునాయాసంగా కైవసం చేసుకుంటామని వైసిపి నేతలు ధీమా వ్యక్తం చేస్తుండడం చూస్తుంటే.. రాజకీయంగాను ప్రాధాన్యత సంతరించుకుంటోంది. ఈ మూడు చోట్ల ఎమ్మెల్యేల పనితీరు, కూటమిలో అంతర్గత కలహాలు తమకు కలిసి వస్తాయని అంచనా వేస్తున్నారు.
కూటమిలో విభేదాలు..
కడప ఎమ్మెల్యేగా టిడిపికి చెందిన మాధవి రెడ్డి ఉన్నారు. ఆమెను సొంత పార్టీ శ్రేణులు వ్యతిరేకిస్తున్నారు. పైగా ఇక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు తమకు కలిసి వస్తాయని చెబుతున్నారు. కర్నూలు తో పాటు తిరుపతిలో వైసీపీకి బలమైన కేడర్ ఉంది. కర్నూలులో సైతం మైనారిటీ ఓటు బ్యాంక్ అధికం. తమకు కలిసి వస్తుందన్న భావనతో వైసీపీలో ఉంది. కర్నూలు నగరం పరిధిలో ఉన్న కోడుమూరు అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా వైసీపీ నేత ఉన్నారు. దీంతో కర్నూలులో సైతం సునాయాసంగా గట్టెకుతామని భావిస్తున్నారు. తిరుపతిలో మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వంటి బలమైన నేత ఉండడం కలిసి వచ్చే అంశం. ఆ స్థాయి నేత కూటమికి ఇక్కడ లేరు. జనసేన ఎమ్మెల్యే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రెండు సంవత్సరాలుగా టిడిపి ఇన్చార్జ్ పోస్ట్ కూడా ఖాళీగా ఉంది. ఇవన్నీ తమకు కలిసి వస్తాయని వైసీపీ అంచనా వేస్తోంది. చూడాలి ఈ విషయంలో వైసిపి ఎంతవరకు సక్సెస్ అవుతుందో.
