-
విజయవాడ మేయర్ పదవి కోసం పవన్ వ్యూహం
-
రాధాకృష్ణను పార్టీలోకి ఆహ్వానించి అప్పగించేందుకు ప్రయత్నం
-
మారనున్న బెజవాడ రాజకీయం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వంగవీటి రాధాకృష్ణ జనసేన లో చేరుతారా? త్వరలో ఆయన పవన్ సమక్షంలో జనసేన గూటికి వెళ్తారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. కొద్దిరోజుల కిందట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను ప్రత్యేకంగా కలిశారు వంగవీటి రాధాకృష్ణ.
తాజాగా చిరంజీవి యువత జాతీయ అధ్యక్షుడు స్వామి నాయుడు సైతం కీలక హింట్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్, వంగవీటి రాధాకృష్ణ కలిసి పనిచేస్తే సూపర్ అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. దీంతో వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం అయినట్లు తెలుస్తోంది.
స్థానిక సంస్థల సీట్ల సర్దుబాటులో భాగంగా.. తెలుగుదేశం పార్టీలో ఉంటే సమీకరణలు కుదరవని.. అందుకే రాధాకృష్ణను జనసేనలోకి పంపించి కీలకమైన విజయవాడ మేయర్ పదవి కట్టబెడతారన్నది పొలిటికల్ వర్గాల్లో ఒక ప్రధాన ప్రచారం.
-
కీలక పదవి ఖాయం..
ప్రస్తుత తెలుగుదేశం పార్టీలో ఉన్నారు వంగవీటి రాధాకృష్ణ. ఆయనకు తప్పకుండా రాజ్యసభ సభ్యుడిగా కానీ.. ఎమ్మెల్సీగా కానీ అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతూ వచ్చింది. కానీ ఆ పదవుల ఎంపిక సమయంలో చివరి వరకు ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. కానీ ఛాన్స్ మాత్రం దక్కలేదు. అయితే ఎక్కడ రాధాకృష్ణ అసంతృప్తి స్వరం వినిపించలేదు.
పైగా సీఎం చంద్రబాబు తో పాటు మంత్రి లోకేష్ తో మంచి అనుబంధం కొనసాగిస్తూ వచ్చారు. ఇంతలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ప్రధానంగా విజయవాడ మేయర్ పదవి కోసం రాధాకృష్ణ పేరును పరిశీలిస్తున్నట్లు ప్రచారం మొదలైంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే రాధాకృష్ణ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలిశారు.
అయితే విజయవాడ మేయర్ సీటును జనసేన కోరుకుంటుందని.. సమీకరణల్లో భాగంగా రాధాకృష్ణను జనసేనలోకి పంపించి కూటమి అభ్యర్థిగా బరిలో దించుతారని పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ నడుస్తోంది. సరిగ్గా అటువంటి సమయంలోనే అఖిలభారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన చేశారు. త్వరలో పవన్ కళ్యాణ్ తో వంగవీటి రాధాకృష్ణ పనిచేయబోతున్నారన్న సంకేతాలు ఇచ్చారు.
-
కాంగ్రెస్ ద్వారా ఎంట్రీ..
కాంగ్రెస్ పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వంగవీటి రాధాకృష్ణ 2004లో తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.
వైసిపి ఆవిర్భావంతో ఆ పార్టీలో చేరారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2019 ఎన్నికల్లో ఆశించిన సీటు దక్కకపోవడంతో వైసీపీకి గుడ్ బై చెప్పి టిడిపిలో చేరారు. టిడిపి ఓటమి చవిచూసింది కానీ ఆ పార్టీని వీడలేదు రాధాకృష్ణ.
అందుకే మొన్నటి ఎన్నికల్లో ప్రచారం కూడా చేశారు. టిడిపి కూటమి గెలిచేసరికి రాధాకృష్ణకు పదవి ఖాయమన్న ప్రచారం జరిగింది. అయితే రెండేళ్లు దాటుతున్న రాధాకు ఎటువంటి పదవి లేదు. ఇప్పుడు మేయర్ పదవి కోసం ఆయన పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
-
క్యాబినెట్ పదవి..
రాష్ట్ర రాజకీయాలకు గుండెకాయ లాంటిది విజయవాడ. పైగా అమరావతి రాజధానికి చెంతనే ఉంటుంది కాబట్టి అక్కడి రాజకీయాల్లో ముద్ర వేయాలని నేతలు ప్రయత్నిస్తుంటారు. అయితే ఇప్పటివరకు ఎమ్మెల్సీగా, రాజ్యసభ కోసం ప్రయత్నాలు చేశారు రాధాకృష్ణ. కానీ మేయర్ పదవి అనేది క్యాబినెట్ హోదాతో కూడుకున్నది.
అయిదారు నియోజకవర్గాల్లో విస్తరించి ఉంటుంది విజయవాడ నగరపాలక సంస్థ. విజయవాడ పొలిటికల్ గ్రిప్ మొత్తం మేయర్ పదవిలో ఉంటుంది. అందుకే వంగవీటి రాధాకృష్ణను జనసేనలోకి రప్పించి మేయర్ పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.
