ప్రపంచ చరిత్రలో ఎన్నో విచిత్ర సంఘటనలు నమోదయ్యాయి. అయితే తల లేకుండానే 18 నెలల పాటు జీవించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఒక కోడి కథ మాత్రం ఇప్పటికీ వినేవారిని విస్మయానికి గురిచేస్తోంది. అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో 1945లో జరిగిన ఈ సంఘటన అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. “మిరాకిల్ మైక్” పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ కోడి శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరిచింది. సాధారణంగా తల తెగిన క్షణాల్లోనే ఏ జీవి అయినా ప్రాణాలు కోల్పోతుంది. కానీ మైక్ అనే ఈ కోడి మాత్రం ఆ అంచనాలను తలకిందులు చేస్తూ నెలలు కాదు, ఏకంగా 18 నెలల పాటు జీవించి చరిత్ర సృష్టించింది.
1945 సెప్టెంబర్ 10న కొలరాడోకు చెందిన లాయిడ్ ఓల్సన్ అనే రైతు తన ఫామ్‌లో కోళ్లను కోస్తున్న సమయంలో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మైక్ అనే కోడి తలపై గొడ్డలితో వేటు వేయగా దాని తల పూర్తిగా వేరుపడింది. అయితే అందరూ ఊహించినట్లుగా అది అక్కడికక్కడే చనిపోలేదు. తల తెగిపోయిన వెంటనే మైక్ లేచి నడవడం, అటూ ఇటూ పరిగెత్తడం ప్రారంభించింది. ఈ దృశ్యం చూసిన రైతు లాయిడ్ ఓల్సన్ ఆశ్చర్యానికి గురయ్యాడు. మొదట అది కొద్దిసేపటికే చనిపోతుందని భావించిన ఆయన, రాత్రికి దానిని ఒక పాత పెట్టెలో ఉంచాడు. కానీ మరుసటి రోజు ఉదయం కూడా మైక్ ప్రాణాలతో ఉండటాన్ని చూసి నివ్వెరపోయాడు. అక్కడి నుంచే మిరాకిల్ మైక్ కథ ప్రపంచానికి తెలిసింది.
ఈ సంఘటనపై శాస్త్రవేత్తలు పరిశోధనలు నిర్వహించగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోడి తల పూర్తిగా తెగిపోయినప్పటికీ, మెదడు వెనుక భాగంలో ఉండే ముఖ్యమైన బ్రెయిన్ స్టెమ్ దెబ్బతినలేదని గుర్తించారు. కోళ్లలో శ్వాస, గుండె స్పందన, జీర్ణక్రియ వంటి ప్రాథమిక శారీరక ప్రక్రియలను నియంత్రించే భాగం ఇదే. గొడ్డలి వేటు వేసినప్పుడు ఆ కీలక భాగం సురక్షితంగా మిగిలిపోవడంతో మైక్ ప్రాణాలతో బయటపడిందని శాస్త్రవేత్తలు వివరించారు. అంతేకాకుండా తల తెగిన వెంటనే రక్తం గడ్డకట్టిపోవడంతో అధిక రక్తస్రావం జరగలేదు. దీంతో అది మరింత కాలం జీవించే అవకాశం లభించింది.
మైక్‌ను బతికించేందుకు రైతు లాయిడ్ ఓల్సన్ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నాడు. డ్రాపర్ సహాయంతో నేరుగా ఆహార వాహికలోకి ద్రవ ఆహారం, నీటిని పంపిస్తూ దానిని సంరక్షించాడు. కొద్దికాలానికే ఈ వింత కథ అమెరికా అంతటా సంచలనంగా మారింది. మిరాకిల్ మైక్‌ను చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపడంతో ఓల్సన్ దానిని దేశవ్యాప్తంగా ప్రదర్శనలకు తీసుకెళ్లాడు. వేలాది మంది టికెట్లు కొనుగోలు చేసి ఈ అద్భుత కోడిని ప్రత్యక్షంగా చూశారు. ప్రముఖ పత్రికలు కూడా మైక్ కథను ప్రచురించడంతో అది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మైక్ కారణంగా రైతు కుటుంబం అప్పట్లోనే మంచి ఆదాయం కూడా సంపాదించింది.
అయితే ఈ అద్భుత జీవి జీవితానికి 1947లో విషాదాంతం ఏర్పడింది. ఒక హోటల్‌లో ఉన్న సమయంలో మైక్ గొంతులో శ్లేష్మం ఇరుక్కుపోయి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడింది. దానిని తొలగించేందుకు అవసరమైన సిరంజి ఆ సమయంలో రైతు వద్ద లేకపోవడంతో మైక్ ప్రాణాలు కోల్పోయింది. అయినప్పటికీ తల లేకుండా అత్యధిక కాలం జీవించిన జీవిగా మైక్ ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది. నేటికీ కొలరాడోలో మిరాకిల్ మైక్ జ్ఞాపకార్థం ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుండటం విశేషం.
ALSO READ: అషురెడ్డి కేసు హైకోర్టు స్టే రద్దు…!