కొత్త విద్యా సంవత్సరానికి నేటి నుంచి పాఠశాలలు ప్రారంభమవడంతో రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సందడి నెలకొంది. కొత్త పుస్తకాలు, కొత్త యూనిఫాంలు, కొత్త లక్ష్యాలతో చిన్నారులు ఆనందంగా బడిబాట పట్టారు. అయితే చదువుల పండుగగా భావించిన తొలి రోజే ఓ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పాఠశాల ప్రారంభోత్సవ ఏర్పాట్లలో పాల్గొన్న ఓ విద్యార్థి విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడిన ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది.
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కొత్త విద్యా సంవత్సరాన్ని పురస్కరించుకుని విద్యార్థులకు ఘన స్వాగతం పలికేందుకు ఉపాధ్యాయులు, గ్రామస్థులు ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. పాఠశాల ప్రాంగణాన్ని అలంకరించడం, గేటుకు మామిడి తోరణాలు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలో పాఠశాలకు ఎంతో ఉత్సాహంగా వచ్చిన విద్యార్థి రామ్ చరణ్ కూడా అలంకరణ పనుల్లో పాల్గొన్నాడు. ఉపాధ్యాయులు, గ్రామస్తులతో కలిసి గేటు వద్ద మామిడి తోరణం కడుతున్న సమయంలో అనుకోని ప్రమాదం చోటుచేసుకుంది.
తోరణం కడుతున్న సమయంలో సమీపంలో ఉన్న విద్యుత్ తీగలకు తగలడంతో రామ్ చరణ్ ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. బలమైన షాక్ తగలడంతో అతడు అక్కడికక్కడే కిందపడిపోయాడు. ఈ ఘటనను గమనించిన ఉపాధ్యాయులు, గ్రామస్థులు వెంటనే స్పందించి బాలుడిని రక్షించి చికిత్స నిమిత్తం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యుత్ షాక్ ప్రభావంతో శరీరంలోని పలు భాగాల్లో గాయాలు కావడంతో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు కనీసం 2 రోజుల పాటు అబ్జర్వేషన్‌లో ఉంచనున్నట్లు వైద్యులు వెల్లడించారు.
నాంపల్లి మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన రామ్ చరణ్ కొండమల్లేపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఉదయం ఆనందంగా పాఠశాలకు వెళ్లిన తన కుమారుడు కొద్దిసేపటికే ఆసుపత్రి పాలవ్వడం కుటుంబ సభ్యులను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కుమారుడి పరిస్థితిని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయంలో ప్రమాదకర ప్రాంతాల్లో చిన్నారులతో పనులు చేయించడం నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శిస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా పాఠశాలల్లో భద్రతా ప్రమాణాలు కచ్చితంగా అమలు చేయాలని గ్రామస్థులు, విద్యార్థి బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టాలని కూడా కోరుతున్నారు.
ALSO READ: విద్యార్థులకు శుభవార్త.. కేంద్ర ప్రభుత్వం నుంచి స్కాలర్‌షిప్‌లు