క్రైమ్ మిర్రర్ : పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రావాలాకోట్ ప్రాంతంలో జరిగిన నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో భద్రతా బలగాలు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు యువకులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక వర్గాలు వెల్లడించాయి. స్థానికుల సమాచారం ప్రకారం.. అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమాలు హింసాత్మకంగా మారాయి. ముజఫరాబాద్ వైపు చేపట్టిన లాంగ్ మార్చ్‌కు ముందు రావాలాకోట్, చాంద్నీ చౌక్ తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆందోళనకు దిగారు.
నిరసనకారులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు, భద్రతా సిబ్బంది రంగంలోకి దిగారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు బాష్పవాయువు ప్రయోగించడంతో పాటు గాల్లోకి కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారని స్థానిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ కాల్పుల్లో సుమారు 14 మంది యువకులు మృతి చెందినట్లు సమాచారం. పలువురు గాయపడటంతో వారిని స్థానిక ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన అనంతరం పలు ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇక చట్టసభల్లో శరణార్థులకు కేటాయించిన 12 స్థానాలను రద్దు చేయాలనే డిమాండ్‌తో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ నిరసనలకు పిలుపునిచ్చింది. ప్రజా సమస్యలు, రాజకీయ డిమాండ్లపై ప్రారంభమైన ఈ ఆందోళనలు చివరకు తీవ్ర ఘర్షణలకు దారితీశాయి. ప్రస్తుతం పరిస్థితులను అదుపులోకి తీసుకురావడానికి అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై స్థానిక నాయకులు, ప్రత్యక్ష సాక్షుల నుంచి మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.
also read : అంతరిక్షంలో యోగా.. వైరల్ అవుతున్న వ్యోమగామి విన్యాసాలు
