తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్‌ను పునర్వ్యవస్థీకరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కమిషన్ చైర్‌పర్సన్‌గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతో పాటు కమిషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఆరుగురు సభ్యులను ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ నూతన కమిటీలో చిట్యాల శ్వేత, శశికల, సదాలక్ష్మి, రాధ, షకీరా సభ్యులుగా నియమితులయ్యారు. వీరితో పాటు తెలంగాణ ఉద్యమ అమరవీరుడు శ్రీకాంతచారి తల్లి శంకరమ్మకు చోటు కల్పించడం విశేషం. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చైర్‌పర్సన్ తో పాటు సభ్యులు ఐదేళ్ల పాటు ఈ పదవుల్లో కొనసాగుతారు.
ఇప్పటి వరకు మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారద బాధ్యతలు నిర్వర్తించారు. ఆమె కంటే ముందు సునీత లక్ష్మారెడ్డి ఈ పదవిలో పనిచేశారు. రాష్ట్రంలో మహిళల హక్కుల పరిరక్షణతో పాటు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కమిషన్ పనిచేస్తుంది. మహిళలకు జరిగే అన్యాయాలపై విచారణ జరిపి వారికి అవసరమైన చట్టపరమైన రక్షణ కల్పించడంలో కమిషన్ కీలక పాత్ర పోషిస్తుంది. మహిళా సాధికారత కోసం వినూత్న కార్యక్రమాలను రూపొందించడం క్షేత్రస్థాయి సమస్యలను పరిష్కరించడం ఈ కమిషన్ ప్రధాన బాధ్యతగా ఉంటుంది.
రాష్ట్రవ్యాప్తంగా మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులను స్వీకరించి నిష్పక్షపాతంగా విచారణ జరిపే అధికారం ఈ కమిషన్‌కు ఉంటుంది. బాధితులకు చట్టపరమైన సలహాలు అందించడంతో పాటు న్యాయం జరిగేలా ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుంది. మహిళా భద్రతపై అవగాహన కల్పించడం వేధింపుల నిరోధానికి కఠిన చర్యలు తీసుకోవడం వంటి అంశాలపై నూతన కమిషన్ దృష్టి సారించనుంది. గద్వాల విజయలక్ష్మి నాయకత్వంలో ఈ కమిషన్ మహిళా సంక్షేమానికి మరింత బలోపేతంగా పనిచేస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. తెలంగాణ సామాజిక పరిస్థితుల్లో మహిళలకు భరోసా ఇచ్చేలా ఈ నియామకాలు చేపట్టారు.
ALSO READ: చికెన్ కర్రీ ఎంత పనిచేసింది.. ఒకరు మృతి, ఆరుగురికి తీవ్ర గాయాలు