హరియాణా రాష్ట్రంలోని హిసార్ జిల్లా పరిధిలో ఉన్న ఆర్యానగర్ గ్రామస్తులు తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ఊరి వాసులు అంతా ఏకగ్రీవంగా తమ గ్రామంలో ప్రేమ పెళ్లిళ్లను పూర్తిగా నిషేధిస్తున్నట్లు బహిరంగంగా ప్రకటించారు. ఎవరైనా యువతీయువకులు ప్రేమ వివాహం చేసుకుంటే, వారికి ఇకపై ఆ గ్రామంలోకి అడుగుపెట్టే అవకాశం ఉండదని, వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊళ్లోకి అనుమతించబోమని గ్రామస్తులు ఖరాఖండిగా చెప్పారు.
గ్రామస్తులు ఈ స్థాయిలో కఠినమైన నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం ఇటీవల ఆ ఊరిలో జరిగిన కొన్ని ఘటనలే. గత కొద్ది రోజుల్లోనే ఆ ఊరిలో సుమారు 3 నుంచి 4 ప్రేమ పెళ్లిళ్లు జరిగాయి. ఇలాంటి సంఘటనలు పదే పదే జరగడం వల్ల భవిష్యత్తులో గ్రామంలో సామాజిక ఐక్యత దెబ్బతినే ప్రమాదం ఉందని గ్రామ పెద్దలు భావించారు. అందుకే ఊరిలోని ప్రజలందరూ కలిసికట్టుగా ఆలోచించి గ్రామంలో సామాజిక ఐక్యతను కాపాడేందుకు ఈ వివాహాలపై నిషేధాన్ని అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.
అయితే, ఇదే సమయంలో గ్రామస్తులు మరో కీలక విషయాన్ని కూడా స్పష్టం చేశారు. కేవలం పిల్లలు తీసుకున్న నిర్ణయాలకు, వారి చర్యలకు తల్లిదండ్రులను లేదా పెద్దలను ఎట్టి పరిస్థితుల్లోనూ నిందించకూడదని వారు అన్నారు. ఈ సంచలన నిర్ణయంపై మరింత స్పష్టత కోసం, ప్రస్తుతం ఊరిలోని వారు ఇంటింటికీ వెళ్లి ఈ నిషేధంపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకునే పనిలో ఉన్నారట.
టాలీవుడ్లో హీరోల రూపురేఖలు మార్చిన డాషింగ్ డైరెక్టర్… HBD పూరి జగన్నాథ్
