-
సమ్మెతో నిలిచిన 6000 బస్సులు
-
60 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు బుధవారం సమ్మె బాట పట్టారు. ప్రభుత్వంతో నిర్వహించిన చర్చలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో, మంగళవారం అర్ధరాత్రి నుంచే కార్మికులు తమ విధులను బహిష్కరించారు. ఈ సమ్మె కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ డిపోల్లో ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. పలు జిల్లాల్లో బస్సు సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, పరిస్థితిని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం అన్ని ప్రధాన బస్ డిపోల వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసింది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల తెలంగాణ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉందని, ఉద్యోగులందరూ సమ్మె ఆలోచన విరమించి విధులకు హాజరుకావాలని సంస్థ టీజీఆర్‌టీసీ ఎండీ వై. నాగిరెడ్డి పిలుపునిచ్చారు. కార్మికుల డిమాండ్లపై సమగ్రంగా చర్చించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఐఏఎస్ అధికారులతో కూడిన ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని ఆయన గుర్తుచేశారు.
ఈ కమిటీ ఇప్పటికే మంగళవారం కార్మిక సంఘాల ప్రతినిధులతో సమావేశమై పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు ఆయన వివరించారు.కార్మికులు లేవనెత్తిన డిమాండ్లలో కొన్ని ఆర్థికపరమైనవి, సాంకేతిక చిక్కులతో కూడిన అంశాలు ఉన్నాయని, వాటిని క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కార మార్గాలను అన్వేషించడానికి ప్రభుత్వానికి కనీసం 4 వారాల సమయం అవసరమని నాగిరెడ్డి పేర్కొన్నారు. సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున, ప్రభుత్వం కోరిన గడువుకు సహకరించాలని ఆయన కోరారు.అయితే కొన్ని సంఘాలు వాస్తవాలను పక్కనబెట్టి, సమ్మె పేరుతో కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడి ప్రయాణించే దినసరి కూలీలు, సామాన్య ప్రజలు మరియు విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఉద్యోగిపై ఉందని ఆయన హితవు పలికారు. సంస్థ ప్రయోజనాలను, ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, కార్మికులు ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా బాధ్యతాయుతంగా విధుల్లో పాల్గొనాలని ఎండి నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌లు…
ఈ సమ్మెలో కార్మికుల ప్రధాన డిమాండ్ ఆర్టీసీని పూర్తిగా ప్రభుత్వంలో విలీనం చేయడం. సంస్థను కేవలం ఒక కార్పొరేషన్‌గా కాకుండా ప్రభుత్వ శాఖగా గుర్తించి, తమను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణించాలని వారు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీనితో పాటు 2021 నుండి పెండింగ్‌లో ఉన్న వేతన సవరణను 30 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని, అలాగే పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరుతున్నారు. ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులను అద్దెకు తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ, సంస్థే నేరుగా కొత్త బస్సులను కొనుగోలు చేయాలని జేఏసీ స్పష్టం చేస్తోంది.
సమ్మెను అడ్డుకునేందుకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జరిపిన చర్చలు సఫలం కాలేదు. ప్రభుత్వం జీవో నంబర్ 66 ద్వారా ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ, జేఏసీ నాయకులు దానిని ససేమిరా తిరస్కరించారు. నిత్యం ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నారు. చివరకు ఎయిర్‌పోర్ట్ పుష్పక్ సర్వీసులు కూడా నిలిచిపోవడంతో విమాన ప్రయాణికులకు సైతం కష్టాలు మొదలయ్యాయి.