క్రైమ్ మిర్రర్ : ఢిల్లీ మెట్రోలో సీనియర్ సిటిజన్ సీటు విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. ఈ నెల 8న జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
పవన్ శర్మ (48), తన తల్లి దుర్గాదేవి (65)తో కలిసి ఢిల్లీ మెట్రోలో యమునా విహార్ వైపు ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో మండి స్టేషన్ వద్ద రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంజయ్ ప్రతాప్ సింగ్ (65), ఆయన కుమారుడు సిద్ధార్థ్ సింగ్ మెట్రోలోకి ఎక్కారు. సీనియర్ సిటిజన్ సీటు విషయంలో పవన్ శర్మ, ఆయన తల్లితో వారు వాగ్వాదానికి దిగారు.
ఈ క్రమంలో సంజయ్ ప్రతాప్ సింగ్ పవన్ శర్మ చెంపపై కొట్టగా, ఆయన తిరగబడటంతో సిద్ధార్థ్ సింగ్ కూడా దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పవన్ శర్మ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు పవన్ శర్మను ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధితుడి తల్లి దుర్గాదేవి ఫిర్యాదు మేరకు పోలీసులు సంజయ్ ప్రతాప్ సింగ్, సిద్ధార్థ్ సింగ్‌లను అరెస్ట్ చేశారు. చిన్నపాటి సీటు వివాదం చివరకు ఒకరి ప్రాణాలను బలిగొనడం చర్చనీయాంశంగా మారింది.
also read : పూణెలో దారుణం.. కట్నం వేధింపులు భరించలేక మహిళా ఐటీ ఇంజనీర్ ఆత్మహత్య!
