
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్ ప్రక్రియ వేగంగా ముందుకెళ్తోంది. జట్లు నవంబర్ 15 నాటికి తమ రిటెన్షన్ జాబితాలను బీసీసీఐకు తప్పనిసరిగా అందజేయాల్సి ఉంది. శనివారం మధ్యాహ్నం మూడు గంటలలోపు అధికారిక లిస్టులు సమర్పించాల్సిన నేపథ్యంలో పలు జట్లు తమ వ్యూహాలను మార్చుకుంటూ ట్రాన్స్‌ఫర్ డీల్స్‌ను త్వరితగతిన పూర్తి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే సంచలనంగా మారిన ట్రేడ్ ఏమిటంటే.. లక్నో సూపర్ జెయింట్స్ టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను ముంబై ఇండియన్స్‌కు విడుదల చేయడం. ముంబై రూ.2 కోట్ల ఒప్పందంతో శార్దూల్‌ను తమ జట్టులోకి తీసుకున్నది. ఈ ఒక్క ట్రేడ్‌తోనే శార్దూల్ ఐపీఎల్ చరిత్రలో అసాధారణ మైలురాయిని సృష్టించాడు.
శార్దూల్ ఠాకూర్ ఇప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యధికసార్లు ట్రేడ్ చేయబడ్డ తొలి ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 2017 సీజన్‌కు ముందు పంజాబ్ కింగ్స్ అతన్ని రైజింగ్ పూణే సూపర్‌జెయింట్స్‌కు అప్పగించగా, 2023లో ఢిల్లీ క్యాపిటల్స్ అతన్ని కోల్‌కతా నైట్ రైడర్స్‌కు ట్రేడ్ చేసింది. ఇప్పుడు లక్నో నుంచి ముంబై ఇండియన్స్‌కు మారడం అతని మూడో ట్రేడ్. ఐపీఎల్‌లో ఇన్నిసార్లు జట్లు మారిన క్రికెటర్‌గా నిలవడం అతనికి అరుదైన గౌరవం.
అంతేకాదు, ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ అనే అత్యంత విజయవంతమైన మూడు ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించే ఆరో ఆటగాడిగా కూడా శార్దూల్ పేరు చేరింది. దీనికి ముందు హర్భజన్ సింగ్, టిమ్ సౌథీ, రాబిన్ ఉతప్ప, పియూష్ చావ్లా, అజింక్య రహానే మాత్రమే ఈ రికార్డు సాధించారు. మరో ప్రత్యేక విషయం ఏమిటంటే.. 2025 వేలంలో అమ్ముడుపోని శార్దూల్ రీప్లేస్‌మెంట్ ఆటగాడిగా లక్నో సూపర్ జెయింట్స్‌లో చేరి రూ.2 కోట్ల ఒప్పందం పొందాడు. ఆ తర్వాత 2025 సీజన్‌లో పది మ్యాచ్‌ల్లో పదమూడు వికెట్లు తీసి కీలక పాత్ర పోషించాడు. తన ఆటతీరుతో నిరూపించుకున్న శార్దూల్ ఇప్పుడు ముంబై ఇండియన్స్ తరపున మరోసారి కొత్త అవకాశాలను అందిపుచ్చుకునేందుకు సిద్ధమవుతున్నాడు.
ALSO READ: gold price: పసిడి ప్రియులకు ఊరట





