-
స్నేహితుడిని కలిసి వస్తానన్నాడు.. తీరా గ్రామ శివారులో శవమై కనిపించాడు!
-
ఇంటి నుంచి వెళ్లిన శ్రీనివాస్.. ఆ తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్
-
చివరిసారిగా వైన్స్ వద్ద బంధువుతో కనిపించినట్లు సమాచారం
-
రోజుల తర్వాత గ్రామ శివారులో అనుమానాస్పద స్థితిలో మృతదేహం
-
మృతికి కారణమేంటి? పోస్టుమార్టం నివేదికపై పోలీసుల దృష్టి
మంచిర్యాల జిల్లా, క్రైమ్‌మిర్రర్: ఒక చిన్న మాట చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ‘స్నేహితుడిని కలిసి వస్తా’ అన్నదే అతను కుటుంబ సభ్యులతో చెప్పిన చివరి మాట. ఆ తర్వాత ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. ఫోన్ చేసినా స్పందన లేదు. బంధువుల ఇళ్లలోనూ ఆరా తీశారు. చివరకు పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేశారు. ఇంతలో ఊహించని విధంగా గ్రామ శివారులో అతడి మృతదేహం కనిపించింది. దీంతో అసలు ఏం జరిగిందనే ప్రశ్న ఇప్పుడు మిస్టరీగా మారింది. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి గ్రామానికి చెందిన కుడుకల శ్రీనివాస్ (40) ఈ నెల 20న ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. స్నేహితుడిని కలసి వస్తానని చెప్పి మంచిర్యాల వైపు వెళ్లిన ఆయన రాత్రి అయినా తిరిగి ఇంటికి చేరుకోలేదు. మొదట కుటుంబ సభ్యులు సాధారణంగానే భావించినా సమయం గడిచేకొద్దీ ఆందోళన పెరిగింది. శ్రీనివాస్‌కు ఫోన్ చేయగా స్పందన రాకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు అతడి కోసం వెతకడం ప్రారంభించారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో నీల్వాయి పోలీస్‌స్టేషన్‌లో మిస్సింగ్ ఫిర్యాదు చేశారు.
చివరిసారి ఎక్కడ కనిపించాడు…?
శ్రీనివాస్ మిస్సింగ్ అయిన రోజే రాత్రి సుమారు 8 గంటల సమయంలో చెన్నూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ సమీపంలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర వైన్స్ వద్ద కనిపించినట్లు సమాచారం. అక్కడ తన దూరపు బంధువు గోదరి సమ్మయ్యతో కలిసి మద్యం సేవించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అక్కడి నుంచి శ్రీనివాస్ ఎటువైపు వెళ్లాడు? ఎవరితో వెళ్లాడు? ఆ తర్వాత ఏం జరిగింది? అనే విషయాలపై ఇప్పుడు పోలీసులు దృష్టి సారించారు.
శివారులో కనిపించిన మృతదేహం…
శ్రీనివాస్ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలిస్తుండగానే శనివారం చెన్నూర్ మండలం సోమనపల్లి గ్రామ శివారులో ఆయన మృతదేహం కనిపించింది. అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభించడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, వైద్య సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహానికి అక్కడే పోస్టుమార్టం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
సమాధానం చెప్పాల్సిన ప్రశ్నలెన్నో…
శ్రీనివాస్ మరణం ప్రమాదమా? సహజ మరణమా? లేక మరేదైనా కారణముందా? అనే అంశాలపై ప్రస్తుతం స్పష్టత లేదు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి సంబంధించిన కీలక వివరాలు బయటపడే అవకాశం ఉంది. ఇక శ్రీనివాస్ చివరిసారిగా ఎక్కడ కనిపించాడు, ఎవరెవరిని కలిశాడు, ఆ తర్వాత అతడి కదలికలు ఎలా ఉన్నాయి అనే వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. ఘటనాస్థలంలో లభించిన ఆధారాలతో పాటు అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ మృతికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగుతోంది. పోస్టుమార్టం నివేదిక, పోలీసుల విచారణలో వెలుగు చూసే వివరాలపై కుటుంబ సభ్యుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడ చదవండి:
-
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసిన న్యాయవాదులు, ఆర్టీసీ సంఘం నాయకులు
-
పుట్టింటికి వెళ్తాననడంతో భార్యభర్తల మధ్య గొడవ…! చివరికి ఆ ఇంట తీవ్ర విషాదం ….
-
రేషన్ కార్డుల వేదికగా పొలిటికల్ హీట్…! బీజేపీపై మంత్రి ఉత్తమ్ ఫైర్…
-
క్రికెట్ చరిత్రలో విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డులు: సెంచరీలు, వన్డే పరుగుల్లో ద్వితీయ స్థానం
