క్రైమ్ మిర్రర్ : కాఫీ పొడి పెట్టెల మాటున ఎర్రచందనం దుంగలు.. మూడు వాహనాల్లో భారీ అక్రమ రవాణా.. పోలీసుల మెరుపు దాడితో స్మగ్లర్ల ఆట కట్టించారు! జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు.
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఎస్.ఏ. కాశినాయన మండలం ఆకుల నారాయణపల్లె సమీపంలో వాహనాలను తనిఖీ చేశారు. కాఫీ పొడి ప్యాకెట్ల లోడుతో వెళ్తున్న వాహనాన్ని పరిశీలించగా అసలు బాగోతం బయటపడింది. అట్టపెట్టెల మాటున దాచిన ఎర్రచందనం దుంగలను చూసి పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు.
ఈ ఆపరేషన్లో ఎనిమిది మంది అంతర్రాష్ట్ర స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 1.984 టన్నుల బరువున్న 70 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు ఉపయోగించిన మూడు వాహనాలతో పాటు 643 కాఫీ పౌడర్ అట్టపెట్టెలను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సామగ్రి విలువ సుమారు రూ.1.30 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
అరెస్టయిన వారిలో తమిళనాడుకు చెందిన ఏడుగురు, ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒకరు ఉన్నట్లు జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వెల్లడించారు. ఈ ముఠాతో సంబంధం ఉన్న మరికొందరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. పదేపదే నేరాలకు పాల్పడేవారిపై అవసరమైతే పీడీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ ఆపరేషన్ను విజయవంతంగా నిర్వహించిన పోలీసు సిబ్బందిని అభినందించారు.
also read : షాకింగ్…టీనేజర్కు రోబో లైంగిక వేధింపులు…! అసభ్యకరంగా తాకుతూ వెకిలి చేష్టలు…
