HomeజాతీయంSanjeev Arora Arrest: రూ.150 కోట్ల స్కామ్.. పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా అరెస్ట్!

Sanjeev Arora Arrest: రూ.150 కోట్ల స్కామ్.. పంజాబ్ మంత్రి సంజీవ్ అరోరా అరెస్ట్!

పంజాబ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సంజీవ్ ఆరోరాను ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. తప్పుడు బిల్లులు తయారు చేసి సుమారు రూ.150 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి ఆయనను అదుపులోకి తీసుకుని ఢిల్లీకి తరలించారు.

అరెస్టుకు ముందు విస్తృత సోదాలు

అరెస్టుకు ముందు ఈడీ అధికారులు ఢిల్లీ, చండీగఢ్, గురుగ్రామ్ ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. మంత్రి సంజీవ్ అరోరా నివాసాలు, కార్యాలయాలు మాత్రమే కాకుండా ఆయనకు సన్నిహితంగా ఉన్న వ్యక్తుల ఇళ్లలో కూడా తనిఖీలు చేపట్టారు. అలాగే, ఆయన డైరెక్టర్‌ గా ఉన్న హాంప్టన్ స్కై రియల్టీ లిమిటెడ్ కు చెందిన కొన్ని ఆస్తులను కూడా జప్తు చేసినట్లు సమాచారం. ఈ కేసులో గత నెలలోనే సంజీవ్ అరోరాను ఈడీ అధికారులు విచారించారు. అయితే దర్యాప్తుకు ఆయన పూర్తిగా సహకరించడం లేదని ఆరోపిస్తూ ఇప్పుడు అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన లుథియానా పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతకుముందు రాజ్యసభ సభ్యుడిగానూ పనిచేశారు.

మంత్రి అరెస్టును ఖండించిన కేజ్రీవాల్

ఇక ఈ అరెస్టుపై ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2027లో జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తమ ప్రభుత్వాన్ని దెబ్బతీయడానికి బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఈడీని ఉపయోగిస్తున్నారని వారు అన్నారు.  ‘‘ఎన్ని ప్రయత్నాలు చేసినా పంజాబ్‌లో బీజేపీకి ప్రజలు మద్దతు ఇవ్వరు. అన్ని స్థానాల్లో డిపాజిట్లు కూడా కోల్పోతారు’’ అని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. కేంద్రం రాష్ట్రాలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు