క్రైమ్ మిర్రర్ : విశాఖపట్నంలో సంచలనం సృష్టించిన యువతి హత్య కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఒడిశా రాష్ట్రంలోని రాయగడ సమీపంలో సూట్‌కేసులో లభ్యమైన మృతదేహం విశాఖకు చెందిన సంధ్యదేనని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని దర్యాప్తు చేపట్టిన ఒడిశా పోలీసులు పలు ఆధారాలను సేకరించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో భాగంగా లభించిన సాంకేతిక ఆధారాలు, ఇతర వివరాల ఆధారంగా విశాఖకు చెందిన బొలిశెట్టి సురేశ్‌ను గుర్తించిన పోలీసులు విచారించగా, పెళ్లి విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు, ఆ ఆవేశంలో సంధ్యను హత్య చేసినట్లు అతడు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
హత్య అనంతరం నేరాన్ని గోప్యంగా ఉంచేందుకు మృతదేహాన్ని సూట్‌కేసులో ఉంచిన సురేశ్, విశాఖలోని జ్ఞానాపురం రైల్వే స్టేషన్ నుంచి రైలులో ఒడిశాలోని రాయగడకు తీసుకెళ్లి అక్కడ పడేసినట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం అక్కడ సూట్‌కేసు కనిపించడంతో స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహం గుర్తింపు నుంచి నిందితుడి వరకు చేరుకోవడంలో ఒడిశా పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. విశాఖ కంచరపాలెం పోలీసుల సహకారంతో సురేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడు పోలీస్ వాహనానికి ఔట్‌సోర్సింగ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్య జరిగిన పరిస్థితులు, నిందితుడి ఉద్దేశం తదితర అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేసులో మరిన్ని వివరాలు విచారణ పూర్తయ్యాక వెల్లడయ్యే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
also read : వేగంగా మారుతున్నకేంద్ర రాజకీయాలు…! డిఫెన్స్ లో మోడీ…?
