హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అంత సులువు కాదు. అధికారంలో ఉన్నారన్న మాటే కానీ గ్రేటర్ ఎన్నికలపై కొంత ఆందోళన కాంగ్రెస్ పార్టీలో నెలకొంది. అనేక అంశాలు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశముంది. మొన్నటి ఎన్నికల్లోనూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ పరిధిలో కాంగ్రెస్ కు ఒక్క శాసనసభ నియోజకవర్గంలోనూ గెలవలేదు. తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో మాత్రం గెలిచి హైదరాబాద్ లో కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం లభించినట్లయింది. అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు మాత్రం అంత సులువు కాదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్ నగర అభివృద్ధి కంటే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలపై దృష్టి పెట్టిందన్న విమర్శలున్నాయి. బీఆర్ఎస్ హయాంలో వేగంగా హైదరాబాద్ అభివృద్ధి చెందిందని, కానీ కాంగ్రెస్ హయాంలో కొంత హైదరాబాద్ లో అభివృద్ధి వెనకబడి ఉందని అంటున్నారు.
Also Read:ఇంజనీర్ల సామర్థ్యంపై సీఎం రేవంత్ వ్యాఖ్యలు.. కేటీఆర్ తీవ్ర కౌంటర్!
రియల్ ఎస్టేట్ కూడా పెద్దగా ముందుకు పోవడం లేదు. అనేక ఇళ్లు కొనుగోలు చేయకుండా మూలన పడి ఉన్నాయి. ఇదే సమయంలో రహదారులు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. వర్షం కురిస్తే చాలు మ్యాన్ హోల్స్ లో పడి మృతులు కూడా ఇటీవల కాలంలో ఎక్కువవుతున్నారు. అలాగే మంచినీటి సరఫరా కూడా వేసవిలో సక్రమంగా అందకపోవడంతో నగరవాసులు ఒకింత అసంతృప్తితో ఉన్నారంటున్నారు మరొకవైపు హైడ్రా అంశం కూడా కీలకంగా మారింది. హైడ్రా అధికారులు ఆక్రమణలు కూల్చివేయడంతో అనేక మంది తమ నివాసాలను కోల్పోయారు. హైడ్రా ఏకపక్షంగా వ్యవహరిస్తుందని, అన్యాయంగా కూల్చివేస్తుందని ఆరోపిస్తున్నారు. మరొకవైపు మూసీ రిజర్వాయర్ ప్రక్షాళన పనులు ప్రారంభిస్తామని చెప్పడం, సర్వేలు చేయడం వంటివి కూడా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశాలున్నాయన్న అంచనాలు వినపడుతున్నాయి.
Also Read:మలబద్ధకం ఎందుకు వస్తుంది?.. కారణాలు ఇవే!
దీంతో పాటు హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్, బీజేపీ బలంగా ఉండటం, కాంగ్రెస్ ఏ మేరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలలో అత్యధిక స్థానాలను సాధిస్తుందన్న ప్రశ్నలు సొంత పార్టీ నేతల నుంచే వినిపిస్తున్నాయి. బీజేపీ హిందుత్వ నినాదంతో వెళుతుండటం, మజ్లిస్ పార్టీతో కాంగ్రెస్ సన్నిహిత్వంపై ప్రశ్నిస్తుండటం కూడా కాంగ్రెస్ ను కొంత గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు కలవరానికి గురి చేస్తున్నాయని చెప్పక తప్పదు.
