-
20 రోజులు పాటు అక్కడే
-
రాజకీయ కార్యకలాపాలకు దూరం
-
అనారోగ్య సమస్యలకు ప్రకృతి వైద్యం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తరచూ అనారోగ్యానికి గురవుతున్నారు. మొన్న ఆ మధ్యన ముంబైలో శస్త్ర చికిత్స కూడా చేసుకున్నారు. కొద్దిరోజుల విశ్రాంతి తర్వాత శాఖా పరమైన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇంతలోనే మరోసారి అస్వస్థతకు గురవుతూ ఇంటికి పరిమితం అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్యం పై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు.
ఆయుర్వేద, ప్రకృతి వైద్య చికిత్స తీసుకున్నారు. ఇందుకుగాను పవన్ కళ్యాణ్ కేరళ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ 20 రోజులపాటు ప్రత్యేక చికిత్స తీసుకోనున్నారు. వరుసగా పాలనా బాధ్యతలు, రాజకీయ పర్యటనలతో బిజీగా గడుపుతున్న ఆయన.. ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే దిశగా వైద్యుల సూచన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
-
తీవ్ర అనారోగ్య సమస్యలతో..
గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. తీవ్రమైన పని ఒత్తిడి, వాతావరణ మార్పుల కారణంగా ఆయన వైరల్ ఫీవర్, స్పాండిలైటిస్, శ్వాసకోస సంబంధిత సమస్యల బారిన పడుతున్నారు.
గతంలోనూ పలు పర్యటనలు, అధికారిక సమీక్షలు సైతం వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. తరచూ ఆయన క్యాబినెట్ సమావేశాలకు సైతం గైర్హాజరు కావాల్సి వచ్చింది. మొన్న స్వాతంత్ర దినోత్సవం నాడు ఆయన మరోసారి జ్వరం బారిన పడ్డారు. వెంటనే విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది.
-
భుజం నొప్పితో..
సినీ రంగం నుంచి రాజకీయాల్లో అడుగుపెట్టారు పవన్ కళ్యాణ్. విపరీతమైన క్రేజ్ తో ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానులు వెంటపడేవారు. ఈ క్రమంలోనే ఆయన భుజానికి సంబంధించి గాయం ఒకటి వెంటాడింది. ముంబైలో ప్రత్యేక చికిత్స కూడా తీసుకున్నారు.
ఆపరేషన్ అనంతరం పూర్తిగా కోలుకోవడానికి.. వెన్నుతోపాటు కండరాల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి సాంప్రదాయ కేరళ ఆయుర్వేద, ప్రకృతి వైద్య విధానం సరైన పరిష్కారమని నిపుణులు సూచించారు. ఈ క్రమంలోనే ఆయన కేరళలోని ప్రకృతి చికిత్స కేంద్రంలో చేరి సమగ్ర రికవరీ కోరుతున్న పూర్తి చేయాలని నిర్ణయించారు.
-
అత్యవసర ఫైళ్ళకు మాత్రమే..
పవన్ కళ్యాణ్ కేరళలో పర్యటన నేపథ్యంలో.. 20 రోజులపాటు అందుబాటులో ఉండరు. పాలనాపరమైన అంశాలతో పాటు రాజకీయ భేటీలకు సైతం దూరంగా ఉండనున్నారు. అత్యవసర ఫైళ్ళకు సంబంధించి ఆన్లైన్ ద్వారా లేదా వ్యక్తిగత సిబ్బంది సహాయంతో పర్యవేక్షించనున్నట్లు సమాచారం. అయితే పవన్ కేరళ పర్యటన నేపథ్యంలో.. ముందస్తుగానే పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. స్థానిక ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు.
