Homeఆంధ్ర ప్రదేశ్టిడిపికి మరో గవర్నర్ పదవి...!

టిడిపికి మరో గవర్నర్ పదవి…!

  • యనమల రామకృష్ణుడు లేదా ప్రతిభా భారతి

  • ఇద్దరు సీనియర్ల పేర్లు పరిశీలిస్తున్న చంద్రబాబు

  • ఇద్దరిలో ఒకరికి ఖాయం

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. దేశవ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గట్టి వ్యూహాలను అమలు చేస్తోంది. అందులో భాగంగా ఎన్డీఏ మిత్రపక్షాలతో మరింత బంధాన్ని పెంచుకోవాలని చూస్తోంది. అవసరం అనుకుంటే బలమైన ప్రాంతీయ పార్టీలను ఎన్డీఏలోకి తేవాలని చూస్తోంది.

ఇంకోవైపు ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటుతున్న తరుణంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పై ప్రత్యేకంగా దృష్టి సారించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలకు కేంద్ర మంత్రివర్గంలో పెద్దపీట వేయాలని చూస్తోంది.

మరోవైపు కీలకమైన రాష్ట్రాలకు గవర్నర్ పోస్టులను సైతం నియమించాలని చూస్తోంది. వచ్చే ఏడాది దాదాపు పది మంది వరకు గవర్నర్ల పదవీ విరమణ జరగనుంది.. వారి స్థానంలో బిజెపి సీనియర్లను పంపించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. పనిలో పనిగా టిడిపి లాంటి మిత్రపక్షాలకు సైతం గవర్నర్ పోస్టులు కేటాయించాలని భావిస్తున్నట్లు సమాచారం.

  • రాజ్యాంగబద్ధ పదవి..

గవర్నర్ పోస్ట్ అనేది రాజ్యాంగబద్ధ పదవి. అందుకే దేశవ్యాప్తంగా బలమైన రాష్ట్రాలకు సొంత మనుషులను గవర్నర్లుగా నియమించుకోవాలని చూస్తోంది కేంద్రం. అందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పోస్ట్ ఇవ్వాలని సూత్రప్రాయంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

గతంలో పూసపాటి అశోక్ గజపతిరాజుకు గవర్నర్గా అవకాశము ఇచ్చింది కేంద్రం. ప్రస్తుతం ఆయన గోవా గవర్నర్గా పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది ఖాళీ అవుతున్న పెద్ద రాష్ట్రానికి ఆయనను గవర్నర్గా పంపించే అవకాశం ఉంది.

మరోవైపు మరో గవర్నర్ పోస్ట్ టిడిపికి కేటాయిస్తూ చంద్రబాబుకు కేంద్ర పెద్దలు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖంగా ఇద్దరు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు లేదా మహిళా నేత ప్రతిభ భారతికి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది.

  • సీనియర్ మోస్ట్ లీడర్..

యనమల రామకృష్ణుడు సుదీర్ఘకాలం తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చారు. తెలుగుదేశం ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టారు. 1983లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన తుని అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1999 వరకు గెలుస్తూనే ఉన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి యనమల మంత్రి అయ్యారు.

1994లో మాత్రం స్పీకర్ అయ్యారు. 2014లో ఎమ్మెల్సీగా ఉన్న ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు చంద్రబాబు. 2024లో ఎమ్మెల్సీగా ఉన్న ఆయన ఎటువంటి మంత్రి పదవి ఇవ్వలేదు. ఎమ్మెల్సీగా రెన్యువల్ లభించలేదు. ఆయన రాజ్యసభ పదవి ఆశిస్తున్నట్లు ప్రచారం నడిచింది. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయన పేరును గవర్నర్ పోస్ట్ కు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

  • మహిళా నేతగా గుర్తింపు..

మరోవైపు తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ మహిళా నేత ప్రతిభా భారతికి సైతం గవర్నర్ పోస్ట్ దక్కే ఛాన్స్ కనిపిస్తోంది. సుదీర్ఘకాలం ఆమె తెలుగుదేశం పార్టీలో పని చేస్తూ వచ్చారు. 1983 నుంచి 1999 వరకు ఆమె శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఆమెకు మంత్రి పదవి దక్కుతూ వచ్చింది. ఒకసారి మాత్రం అసెంబ్లీ స్పీకర్ అయ్యారు. తొలి మహిళా స్పీకర్ గా రాణించారు. పార్టీకి ఆమె చేసిన సేవలు, సీనియారిటీని గుర్తించి గవర్నర్గా ఆమె పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఆ ఇద్దరు నేతల్లో ఒకరికి గవర్నర్ పోస్ట్ ఖాయమని తెలుస్తోంది.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు