Homeజాతీయంబిజెపి నయా రాజకీయం.. ప్రతిపక్ష పార్టీలు కకావికలం.!

బిజెపి నయా రాజకీయం.. ప్రతిపక్ష పార్టీలు కకావికలం.!

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : దేశంలో భారతీయ జనతా పార్టీ సరికొత్త రాజకీయాన్ని అవలంబిస్తోంది. గడిచిన 12 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులోనూ అధికారానికి ఇబ్బందులు లేకుండా చూసుకునే వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ క్రమంలోనే దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం సరికొత్త రాజకీయ విధానాన్ని అనుసరిస్తుందని చెబుతున్నారు. గత కొన్నాళ్లుగా రాజకీయాలను పరిశీలిస్తున్న వారికి బిజెపి ఆడుతున్న సరికొత్త గేమ్ అర్థమవుతుంది. ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు తమ బలాన్ని పెంచుకునేందుకు ఇతర పార్టీలకు చెందిన బలమైన నాయకులను పార్టీలో చేర్చుకుంటూ వస్తున్నాయి. ఇదే విధానాన్ని భారతీయ జనతా పార్టీ కూడా అనేక రాష్ట్రాల్లో అవలంబిస్తూ వచ్చింది.

అయితే ఈ మధ్యకాలంలో బిజెపి ఆడుతున్న గేమ్ ప్లాన్ చూస్తుంటే సరికొత్త ప్రణాళికతో బిజెపి వ్యూహరచన చేస్తూందని అర్థమవుతుంది. ఇప్పటివరకు బలమైన నేతలను తమ పార్టీలో చేర్చుకుంటూ వస్తున్న బిజెపి అగ్ర నాయకులు.. ఇప్పుడు ప్రతిపక్ష పార్టీల్లో కల్లోలం సృష్టించడం ద్వారా తాము మరింత బలంగా నిలదొక్కుకునే ప్రణాళికలను రచిస్తోంది. ఈ క్రమంలోనే పశ్చిమబెంగాల్లో ఓటమి తరువాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపింది. మెజారిటీ ఎమ్మెల్యేలు రెబల్ నేత ఆధ్వర్యంలో పార్టీకి దూరంగా వెళ్లేలా చేశారు. పలువురు ఎంపీలు కూడా ఇదే బాట పట్టేలా బిజెపి వ్యూహరచన చేసింది. దీంతో పశ్చిమ బెంగాల్లో వాటిని పాలైనప్పటికీ భారీ సంఖ్యలో ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకొని బలంగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు బలహీనపడేలా బిజెపి చేయగలిగింది. ప్రస్తుత పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోల్పోవడం సాధ్యం కాదు అన్న పరిస్థితి తాజా రాజకీయ పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది.

బిజెపి దూకుడును తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ప్రతిపాదనలను కూడా మమతా బెనర్జీ పెట్టారంటే పశ్చిమ బెంగాల్లో బిజెపి ఆడుతున్న గేమ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే వ్యూహాన్ని తాజాగా మహారాష్ట్రలోనూ బిజెపి అనుసరిస్తోంది. భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని భావిస్తున్న ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యుబిటి) ని విచ్ఛిన్నం చేయాలని భారతీయ జనతా పార్టీ భావించింది. అందులో భాగంగానే యూబీ టీ కి చెందిన పలువురు రెబల్ ఎంపీలను ప్రోత్సహించి తమదే అసలైన పార్టీ అంటూ స్పీకర్కు లేఖ రాసేలా చేశారు. అనుకున్నట్టుగానే రెబల్ ఎంపీలకు అనుకూలంగానే స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మహారాష్ట్రలో యుబిటి రెండు ముక్కలయ్యే పరిస్థితి ఏర్పడింది. గతంలోనూ షిండే వర్గం బయటకు రావడంతో శివసేన దారుణంగా దెబ్బతింది.

ఈ నేపథ్యంలోనే యూబీటీ కూడా మరోసారి ముక్కలవుతుండడంతో మహారాష్ట్రలో ఆ పార్టీ కోలుకోనే పరిస్థితి కనిపించడం లేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇండియా కూటమిలో కీలకంగా ఉన్న సమాజ్వాది పార్టీ కూడా ఉత్తరప్రదేశ్లో బిజెపికి ఇబ్బందికరంగా మారింది. యూపీలో బలమైన పార్టీగా ఉన్న ఎస్పీలోనూ చీలికలు తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే పలువురు ఎంపీలు తమను ప్రత్యేక వర్గంగా గుర్తించాలంటూ స్పీకర్కు లేఖ రాసేందుకు సిద్ధమవుతున్నారంటూ ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దేశవ్యాప్తంగా బిజెపి అనుసరిస్తున్న విధానాల్లో భాగంగానే యూపీలో కూడా వ్యూహరచన చేస్తోంది అన్న ప్రచారం జరుగుతోంది. యూపీలో కూడా సుమారు 25 మంది సమాజ్వాది పార్టీకి చెందిన ఎంపీలు బిజెపికి దగ్గర అవకాశం ఉందన్న ప్రచారము జరుగుతోంది. అదే జరిగితే భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మరింత బలంగా తయారయ్యే అవకాశం ఉంది. బిజెపి సాగిస్తున్న సరికొత్త నయా రాజకీయానికి ప్రాంతీయ పార్టీలు సమిధులు మారుతుండడం గమనార్హం.

బిజెపికి చెప్పే దీటైన రాజకీయం కొరవడడం సమస్య..

దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను విచ్ఛిన్నం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేసే రీతిలో బలమైన నాయకత్వం జాతీయస్థాయిలో ప్రతిపక్షాలకు లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీతో అడుగు వేసి నడుస్తున్న పార్టీలే ప్రస్తుతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. కానీ వీటికి అడ్డుకట్ట వేయడంలో ప్రతిపక్షాలు విఫలం అవుతున్నాయి. ఆయా పార్టీలో చిచ్చు రేగుతుండడాన్నీ చూస్తున్న ఇతర పార్టీలు.. అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు సాగించకపోవడంతో ప్రాంతీయ పార్టీలు ఇబ్బందుకర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. బిజెపి ఈ స్పెషల్ ఆపరేషన్ మిగిలిన రాష్ట్రాల్లోనూ కొనసాగించే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మెజారిటీ ఎంపీ స్థానాలను తమకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా కీలక బిల్లులను పెట్టేందుకు బిజెపి సిద్దపడుతోంది.

అయితే ఈ నయా రాజకీయం ఈ బిల్లులకు మాత్రమే పరిమితం చేస్తారా.. భవిష్యత్తులో అధికారాన్ని మరింత సుస్థిరం చేసుకునే దిశగా ముందుకు తీసుకువెళతారా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా బిజెపి ఆడుతున్న రాజకీయ చదరంగంలో ప్రాంతీయ పార్టీలు కాకా వికలం అవుతుండడం ఇక్కడ ఆందోళన కలిగిస్తోంది. గత కొన్నాళ్లుగా దేశంలో అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కీలకంగా మారిన నేపథ్యంలో.. తాజాగా బిజెపి సాగిస్తున్న రాజకీయంతో మరోసారి వాటి మనుగుడ ప్రశ్నార్ధకం కానుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రాంతీయ పార్టీలను ఏర్పాటు చేసిన ముఖ్య నాయకులు మళ్లీ కాంగ్రెస్లో తమ పార్టీలను విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు చెబుతున్నారు. అదే జరిగితే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయ్యే అవకాశాన్ని కల్పిస్తున్నట్టుగానే భావించాల్సి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. మరి దేశంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాల్సి ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు